ప్రభాస్ కదులుతున్నాడు.. మిగతా వాళ్లు?

కరోనా ధాటికి టాలీవుడ్లో సినీ కార్యకలాపాలు ఆగిపోయాయి ఐదు నెలలు దాటింది. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ పున:ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చినా.. హైదరాబాద్ పరిధిలో విపరీతంగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటం, అనేక షరతులు పాటించాల్సి ఉండటంతో చిత్రీకరణలకు ధైర్యం చేయలేదు ఫిలిం మేకర్స్. ఐతే ఇలా ఎంత కాలమని ఆగుతారు? ఆగలేని పరిస్థితి.

హైదరాబాద్ పరిధిలో కరోనా ప్రభావం కొంత మేర తగ్గడం, వచ్చే నెలలో మరింత తగ్గుముఖం పడుతుందన్న అంచనాల నేపథ్యంలో షూటింగ్స్ పున:ప్రారంభించడానికి పెద్ద చిత్రాల నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. ముందుగా ఈ విషయంలో చొరవ చూపుతున్నది ‘రాధేశ్యామ్’ టీం కావడం విశేషం. తమ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ సెప్టెంబరు రెండో వారంలో మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు.

‘రాధేశ్యామ్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వినాయక చవితి సందర్భంగా ట్విట్టర్లో ‘రాధేశ్యామ్’ షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ప్రభాస్, పూజాలతో అత్యంత పెద్దదైన, అందమైన షెడ్యూల్‌ను సెప్టెంబరు రెండో వారంలో ఆరంభించనున్నట్లు అతను ప్రకటించాడు. సినిమా చిత్రీకరణ 80 శాతం దాకా పూర్తయిందని.. మిగతా టాకీ పార్ట్ అంతా సింగిల్ షెడ్యూల్లో విరామం లేకుండా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోందని సమాచారం. టాకీ పార్ట్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కొన్ని నెలల సమయం పడుతుంది.

ఇక్కడి నుంచి అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవిలోనే ‘రాధేశ్యామ్’ను విడుదల చేయాలన్నది ప్రణాళిక. దీని సంగతి త్వరగా తేల్చి బాలీవుడ్ మెగా మూవీ ‘ఆదిపురుష్’ పని మొదలుపెట్టాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ప్రభాస్ లాంటి పెద్ద హీరో చేస్తున్న భారీ చిత్రం కరోనా భయాన్ని వీడి చిత్రీకరణకు రెడీ అయిపోతున్న నేపథ్యంలో మిగతా హీారోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఇక చిత్రీకరణలకు రెడీ అయిపోవాల్సిందన్నమాటే.