ఈ ఏడాది సంక్రాంతి రేంజ్ లో దసరా పండక్కు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొనడం బయ్యర్లలో ఒకపక్క ఆనందాన్ని ఇంకోవైపు ఆందోళనని రేకెత్తిస్తోంది. వరస సెలవులు వచ్చే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఎంత స్టార్ హీరోలైనా సరే ఖచ్చితంగా పడుతుంది. అందుకే ఈ సీజన్ ని ఎక్కువగా టార్గెట్ చేయరు. విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి అక్టోబర్ 19న వస్తున్నాయి. రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఒక రోజు ఆలస్యంగా 20న థియేటర్లలో అడుగుపెడతాడు. తమిళనాడులో లియోకి ఏ సమస్య లేదు. అయితే వేరే ట్విస్టు ఉంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో విజయ్ కు బాలయ్య, రవితేజ నుంచి గట్టి ప్రతిఘటన ఉంటుంది. అందుకే లియో నిర్మాతలు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన స్ట్రాటజీలు రచించారు. అందులో భాగంగానే ఇంకా నలభై రోజులు ఉండగానే యుకెలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. తమిళ వెర్షన్ 18 వేలు, తెలుగు డబ్బింగ్ 2 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ నెంబర్లు భారీ ఎత్తున ఉండబోతున్నాయి. ఇది చాలక ఇండియాలోనూ అక్టోబర్ 18 సాయంత్రం స్పెషల్ పెయిడ్ ప్రీమియర్లు వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారట.
దీనివల్ల లియో టాక్ విదేశాలతో పాటు ఇండియాలోనూ చాలా ముందుగా బయటికి వస్తుంది. పాజిటివ్ అయ్యిందా సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అసలే లియోని తెలుగులో ఇరవై కోట్లకు సితార సంస్థ కొనింది కాబట్టి స్క్రీన్ కౌంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులు కూడా లియోకు తగ్గట్టు ధీటైన ప్లాన్ ని సిద్ధం చేసుకోవాలి. ఇంకా మూడింటి ప్రమోషన్లు పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. చెరో ఒకటి లిరికల్ వీడియోస్ మాత్రమే వచ్చాయి. పబ్లిసిటీ డిజైన్ లోనూ లియో స్పెషల్ గా ఉంటుందట. సో వ్యూహం గట్టిగానే ఉందన్న మాట.