మాస్ మహారాజా చిన్న సినిమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో నెలకొల్పిన ఆర్టి టీమ్ వర్క్స్ నుంచి వస్తున్న చిత్రం ఛాంగురే బంగారురాజా. ఎల్లుండే విడుదల. చిన్న హీరోలు, ఆర్టిస్టులు నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో కేరాఫ్ కంచెరపాలం ఫేమ్ కార్తీక్ రత్నంతో పాటు కమెడియన్ సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ట్రైలర్ బాగానే అనిపించింది. అయితే స్కంద, చంద్రముఖి 2లు తప్పుకోవడంతో హఠాత్తుగా సెప్టెంబర్ 15 డేట్ తీసుకున్న ఈ మూవీ ప్రమోషన్లకు సరైన సమయం దొరక్కపోవడంతో ఉన్న కాసింత టైంలోనే హడావిడిగా పబ్లిసిటీ చేస్తున్నారు.
ఈ సమస్య వల్లే ఎల్లుండి ఇది రిలీజవుతున్న సంగతే పబ్లిక్ కి పూర్తిస్థాయిలో రిజిస్టర్ కాలేదు. ఇటీవలే రవితేజ అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఆయనే దగ్గరుండి టీమ్ ని కూర్చోబెట్టి తనతో పాటు ఇంటర్వ్యూలు చేయించారు. దర్శకుడు సతీష్ వర్మ మీద నమ్మకంతో దీని మీద బడ్జెట్ కూడా బాగానే పెట్టారు. అయితే పోటీ లేకపోవడాన్ని ఛాంగురే బంగారు రాజా వాడుకోవాలంటే టాక్ బ్రహ్మాండంగా రావాలి. స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా, అంచనాలు రాకపోయినా బలగం, సామాజవరగమన లాంటివి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అందుకే రవితేజ కంటెంట్ మీద భారం పెట్టేసి రిలీజ్ చేస్తున్నారు. థియేటర్ల సమస్య పెద్దగా లేదు. జవాన్ తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదించింది. ఖుషికి ఇది ఫైనల్ రన్ వారం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తున్నా మరీ తీవ్రంగా అయితే కాదు. విశాల్ మార్క్ ఆంటోనీ మీద మాస్ వర్గాల్లో బజ్ ఉన్నప్పటికీ అది కూడా టాక్ తెచ్చుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. సో ఈ గ్యాప్ ని కనక కరెక్ట్ గా వాడుకుని ఛాంగురే బంగారురాజా హిట్టు కొట్టడం చాలా కీలకం. గతంలో విష్ణు విశాల్ డబ్బింగ్ మూవీ మట్టి కుస్తీని సమర్పించిన రవితేజకు దాన్నుంచి పెద్దగా ఫలితం రాలేదు.