పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ముందుగా అనౌన్స్ చేసిన సినిమాల్లో హరీష్ శంకర్ చిత్రం ఒకటి. ముందు ఒక కథ, టైటిల్ అనుకుని.. ఆ ప్రాజెక్టు ఎంతకీ ముందుకు కదలకపోవడం.. చివరికి తెరి రీమేక్‌ను తెరపైకి తెచ్చి ఉస్తాద్ భగత్ సింగ్ అనే కొత్త టైటిల్‌తో సినిమాకు ముహూర్త వేడుక నిర్వహించడం.. ఆపై ఆ సినిమా కూడా ముందుకు కదలకపోవడం.. ఇవన్నీ తెలిసిన వ్యవహారాలే.
ఈ సినిమా మీద ఆశలు కోల్పోయిన స్థితిలో ఐదు నెలల ముందు సడెన్‌గా షూటింగ్ మొదలుపెట్టించాడు పవన్. రెండు మూడు షెడ్యూళ్లు చకచకా జరిగాయి. కానీ మధ్యలో మళ్లీ బ్రేక్ పడింది. మూడు నెలలుగా ఎలాంటి చిత్రీకరణ జరగలేదు ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించి. ఎన్నికలు అయ్యే వరకు షూట్ ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది.
కానీ పవన్ మళ్లీ అనుకోకుండా డేట్లు ఇవ్వడంతో రెండు రోజుల ముందే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఘనంగా అనౌన్స్ చేశారు కూడా. కానీ ఒక్క రోజు షూట్ జరిగిందో లేదో అంతలోనే పవన్ బ్రేక్ ఇచ్చేశాడు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో పవన్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని విజయవాడ బయల్దేరాడు.
అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ స్పాట్ నుంచే పవన్ సడెన్‌గా విజయవాడ బయల్దేరినట్లు సమాచారం. దీంతో చిత్ర బృందం అయోమయంలో పడిపోయింది. పవన్ లేకుండా వేరే ఆర్టిస్టుల కాంబినేషన్లో చిత్రీకరణ కొనసాగించారు కానీ.. పవన్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. లేక లేక షూటింగ్ పునఃప్రారంభిస్తే ఇంతలో ఈ బ్రేక్ ఏంటని హరీష్ శంకర్ అండ్ టీం ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates