ఏపీ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీదున్నాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ వల్ల మీడియాతో పాటు ట్విట్టర్, ఇన్స్ స్టా, ఫేస్ బుక్ ఎక్కడ చూసినా దీని గురించిన చర్చే ఎక్కువ జరుగుతోంది. నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి చేరుకునే ప్రయత్నం చేయడం, అడ్డుకునే క్రమంలో పోలీసుల అత్యుత్సాహం పవన్ కే మైలేజ్ ఇవ్వడానికి దోహదపడింది. పార్టీ మీటింగ్ కోసమే పవన్ బయలుదేరానని చెబుతున్నా ఏ మాత్రం అవకాశమున్నా బాబుని కలిసేందుకు వెనుకాడరనే వాస్తవం గ్రహించే అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది.
కార్యకర్తల ఉత్సాహం, అర్ధరాత్రి వర్షం పడుతున్నా తనకు రక్షణగా నిలిచిన అభిమానుల ప్రేమను చూసి పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడపాలని ఆలోచిస్తున్నట్టు సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట . అదే జరిగితే అన్నీ సిద్ధం చేసుకుని కూర్చున్న దర్శకుడు హరీష్ శంకర్ కు మొదటి షాక్ తగులుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా చాలా బ్యాలన్స్ ఉంది. దానికన్నా ముందే వచ్చే ఓజికి ఇంకో నెల రోజులకు పైగా పవన్ డేట్స్ కేటాయించారు. ఒకవేళ ఈ పొలిటికల్ హీట్ ఇలాగే కొనసాగితే మాత్రం షూటింగులకు బ్రేకు వేయక తప్పేలా లేదు.
ఎన్నికలు అతి దగ్గరగా ఉన్న నేపథ్యంలో జనసేన బ్రాండ్ ని మరింత బలంగా మార్చేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఒకవేళ ఎలక్షన్లలో తన ప్రభావం తీవ్రంగా ఉంటే ఒక స్ట్రాటజీ, లేదూ ఆశించిన ఫలితం రాలేదంటే ఎలాగూ కమిటైన సినిమాలు నాలుగు చేతిలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ 2029 దాకా కెరీర్ ని కొనసాగించవచ్చు. ఒకవేళ గెలిచి ఏదైనా సాధిస్తే వీలుని బట్టి బాలన్స్ ఉన్నవి పూర్తి చేసి ఆపై పార్టీ మీదే దృష్టి పెట్టొచ్చు. ఇంకా పొత్తుల తాలూకు వ్యవహారం తేలనే లేదు. సో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దాని మీదే పవన్ సినిమాలు ముందుకెళ్తాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates