ఒకప్పుడు బాలీవుడ్ లో తెలుగు దర్శకులు సినిమాలు తీశారు కానీ ఒక స్థాయికి మాత్రమే పరిమితమై అంతకంటే ఎత్తుకు చేరుకోలేదు. రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు మంచి హిట్లు ఇచ్చినా ఎక్కువ కాలం అక్కడ కొనసాగలేకపోయారు. సత్య, రంగీలా లాంటి క్లాసిక్స్ తో రామ్ గోపాల్ వర్మ తనదైన ముద్ర వేసినప్పటికీ మార్కెట్ ని శాశించిన దాఖలాలు లేవు. ఎంతసేపూ షోలే, హం ఆప్కె హై కౌన్ అంటూ వాటి పేర్లే తిప్పి చెప్పడం తప్ప సౌత్ డైరెక్టర్లు తీసినవి ల్యాండ్ మార్క్ గా నిలువలేకపోయాయి. కానీ కొత్త తరం చరిత్రను తిరగరాస్తోంది. విజయ గర్వంతో రికార్డుల సాక్షిగా దరహాసం చేస్తోంది.
ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ‘ఎస్ఎస్ రాజమౌళి’ అలియాస్ జక్కన్న. బాహుబలితో ఒక తెలుగువాడు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించగలడని నిరూపించిన వైనం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆస్కార్ వేదిక దాకా తీసుకెళ్లింది. ఆర్ఆర్ఆర్ హిస్టరీ గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. తర్వాతి వ్యక్తి ‘ప్రశాంత్ నీల్’. చాలా పరిమితంగా ఉన్న కన్నడ మార్కెట్ ని అమాంతం సహస్ర కోట్లు దాటే రేంజ్ కి కెజిఎఫ్ తో తీసుకెళ్లారు. పన్నెండు వందల కోట్లని సునాయాసంగా సాధించారు. ఇప్పుడు సలార్ కోసం నార్త్ బయ్యర్లు ఎగబడేందుకు కారణం ప్రభాస్ తో పాటు ఆయన సెపరేట్ గా సృష్టించుకున్న బ్రాండ్ ఇమేజే.
పుష్పతో ఉత్తరాది జనాలు సైతం అల్లు అర్జున్ జపం చేసే స్థాయి తీసుకొచ్చిన ఘనత ‘సుకుమార్’కే దక్కుతుంది. సెకండ్ పార్ట్ కోసం ఏకంగా వెయ్యి కోట్ల దాకా ఆఫర్లు రావడమంటే ఆషామాషీ కాదు. అంత డిమాండ్ ఉన్నా నిర్మాతలు ఇంకా డీల్ క్లోజ్ చేయలేదు. తాజాగా ‘అట్లీ’ వచ్చి చేరాడు. పట్టుమని పది సినిమాల అనుభవం లేని ఈ కుర్ర దర్శకుడు జవాన్ లో షారుఖ్ ఖాన్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ ని వెర్రెక్కిపోయేలా చేస్తోంది. ఇక్కడ చెప్పిన వాళ్లంతా వెయ్యి కోట్ల బంగారు బాతులను తీసిన క్రియేటర్సే. ఇంత ఘనత సాధించిన తర్వాత ఖాన్లతో సహా బాలీవుడ్ స్టార్లు మనవాళ్ళ కోసం ఎగబడటంలో ఆశ్చర్యం ఏముంది.