కొన్ని సెంటిమెంట్లు కాకతాళీయంగా ఉన్నా ఫలితాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. గత నెల ఆగస్ట్ లో వచ్చిన జైలర్ రజినీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లో జైలు ఎంత కీలకంగా నిలిచిందో చూశాం. అర్థమయ్యిందా రాజా అంటూ సూపర్ స్టార్ చేసిన రచ్చ మాములుగా పేలలేదు. వృత్తి పేరునే టైటిల్ గా పెట్టి దానికి న్యాయం చేకూర్చారు. తాజాగా దుమ్ము రేపుతున్న జవాన్ లోనూ జైలు బ్యాక్ డ్రాప్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. చిన్న షారుఖ్ అందులోనే పుడతాడు. పెద్దయ్యాక నాన్న కోసం విలన్ డబ్బులు కాజేసే ప్లాన్లన్నీ కారాగారం నుంచే చేస్తాడు. ఇది కూడా భారీ రికార్డులు కొల్లగొడుతోంది.
ఇక్కడితో కథ అయిపోలేదు. సెప్టెంబర్ లో జవాన్ అయ్యాక అక్టోబర్ లో భగవంత్ కేసరి వస్తుంది. అందులో బాలకృష్ణ జైలు జీవితానికి సంబంధించిన ఎపిసోడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఈ భాగం ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు. ఈ లెక్కన చూస్తే బాలయ్యకు సైతం జైలు సెంటిమెంట్ కనక అచ్చివస్తే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చు. లియో, టైగర్ నాగేశ్వరరావు పోటీలో ఉన్నప్పటికీ దీనికి జరుగుతున్న బిజినెస్ క్రేజీగా ఉంది. వీరసింహారెడ్డి కన్నా ఎక్కువ రేట్లతో నిర్మాతలు డీల్స్ క్లోజ్ చేస్తున్నారు
అయినా తెలుగు సినిమాతో జైలు ముడిపడటం ఇప్పటిది కాదు. బోలెడు సూపర్ హిట్లు వచ్చాయి. కమర్షియల్ చిత్రాల్లో ఇది ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా కనిపిస్తుంది కానీ బ్యాక్ డ్రాప్ లో మెయిన్ ఎలిమెంట్ గా రన్ చేయడం మాత్రం తక్కువ. ఖైదీ, అంతిమతీర్పు, ఖైదీ వేట, గణేష్, రక్షణ లాంటి ఎన్నో సినిమాల్లో ఇది చూశాం. అయితే వరస నెలల్లో ఒకదాన్ని మించి మరొకటి జైలు మూవీస్ ఇలా విజయాలు సాధించడం మాత్రం రేర్. జైలర్ 600 కోట్లతో కోలీవుడ్ నెంబర్ వన్ గా నిలవగా, జవాన్ వెయ్యి కోట్లను టార్గెట్ గా పెట్టుకుంది. భగవంత్ కేసరికి ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి.