సౌత్ ఇండియాలో అనుష్క లాంటి ఇమేజ్ చాలా తక్కువమంది హీరోయిన్లకే వచ్చింది. గ్లామర్ రోల్స్ చేస్తున్న సమయంలోనే ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన ఆమె.. ఆ తర్వాత రుద్రమదేవి, భాగమతి చిత్రాలతో ఇంకా పెద్ద రేంజికి వెళ్లింది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించిన అనుష్క.. దాని తర్వాత సినిమాల సంఖ్య బాగా తగ్గించేయడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం.
ఆమె చివరి థియేట్రికల్ రిలీజ్ ‘భాగమతి’ రిలీజై ఐదేళ్లు అయిపోయింది. మధ్యలో ‘నిశ్శబ్దం’ మూవీతో నేరుగా ఓటీటీలో ప్రేక్షకులను పలకరించిన అనుష్క.. ఎట్టకేలకు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో థియేటర్లలోకి వస్తోంది. అనుష్క సినిమాలు మరీ తగ్గించేయడం.. అసలు ప్రమోషన్లకు రాకుండా, ప్రేక్షకులకు కనిపించకుండా ఉండటం మీద అనేక సందేహాలున్నాయి.
‘సైజ్ జీరో’ సినిమా కోసం బరువు పెరిగి తగ్గే క్రమంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయని.. ఆమె లుక్ తేడా కొట్టిందని.. అందుకే అనుష్క బయట కనిపించట్లేదనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సందేహాలకు ఆమె మీడియా ఇంటర్వ్యూల్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘‘సైజ్ జీరో సినిమా వచ్చింది 2015లో. ఆ తర్వాత నేను ‘ఓం నమో వేంకటేశాయ’, ‘బాహుబలి-2’; ‘భాగమతి’.. ఇలా వరుసగా సినిమాలు చేశా.
నేను తీసుకున్న విరామానికి సైజ్ జీరో ఎంతమాత్రం కారణం కాదు. నాకు నచ్చి చేసిన పాత్ర అది. ప్రతి దాంట్లోనూ ప్లస్సులు, మైనస్‌లు ఉంటాయి. దాని కంటే ముందు నేను చేసిన సినిమాల వల్ల చాలా గాయాలయ్యాయి. అందుకే ‘భాగమతి’ తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకున్నా. అది నా వ్యక్తిగత నిర్ణయం. వరుసగా భారీ సినిమాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయా. అందుకే విశ్రాంతి అవసరం అనిపించింది. అంతే తప్ప నా విరామానికి పర్టికులర్‌గా ఏ ఒక్క సినిమానో కారణం కాదు’’ అని అనుష్క స్పష్టం చేసింది.