నాని శర్వాలను దాటి రానా చేతికి

జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన 170వ సినిమాకు రెడీ అవుతున్నారు. జై భీమ్ ఫేమ్ టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోయే ఈ యాక్షన్ కం ఎమోషనల్ డ్రామాలో క్యాస్టింగ్ ని లాక్ చేసినట్టు చెన్నై అప్డేట్. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో ముఖ్యమైన పాత్రలో గతంలో నానిని ఆ తర్వాత శర్వానంద్ ని సంప్రదించిన టీమ్ వాళ్ళిద్దరి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడా అవకాశాన్ని దగ్గుబాటి రానాకి ఇచ్చినట్టు తెలిసింది. నెగటివ్ షేడ్స్ ఉండటమే దీనికి కారణం.

వీళ్ళతో పాటు ఇతర తారాగణంలో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్, మలయాళం నటి మంజు వారియర్ భాగం కాబోతున్నారు. సౌత్ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చబోతున్నాడు. టెక్నికల్ టీమ్ ఇంకా పూర్తి స్థాయిలో లాక్ చేయాల్సి ఉంది. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుపెట్టబోతున్నారు. జ్ఞానవేల్ ఈసారి కూడా సీరియస్ ఇష్యూ తీసుకున్నారు. బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా అమాయకుల ప్రాణాలు ఎలా బలవుతాయో చూపిస్తూ వాటిని కప్పి పెట్టేందుకు పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో ఇందులో చర్చించబోతున్నారు.

టాపిక్ ఎలాంటిదైనా రజని మార్కు హీరోయిజం మిస్ కాకుండా కమర్షియల్ కోణంలో స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలిసింది. బడ్జెట్ కూడా భారీగానే పెట్టబోతున్నారు. ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పుడు సహజంగానే ప్యాన్ ఇండియా ఫ్లేవర్ వచ్చేస్తుంది. బిగ్ బి ఉన్నారు కాబట్టి హిందీ మార్కెట్ ని ఈసారి పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏడు పదుల వయసులోనూ రజని చూపిస్తున్న హుషారు, దూకుడు చూస్తుంటే ఊరికే అయిపోరు సూపర్ స్టార్లనే లైన్ వినబడుతుంది. ఇంతకీ నాని, శర్వాలు నో అనేంత డెప్త్ ఆ క్యారెక్టర్ లో ఏముందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.