మణిశర్మ హవా తగ్గాక తెలుగులో టాప్ సంగీత దర్శకుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు తమన్. నంబర్ వన్ స్థానం కోసం దేవిశ్రీ ప్రసాద్‌తో అతడికి ఎప్పట్నుంచో పోటీ ఉంది. దేవి జోరు తగ్గాక దాదాపుగా అతనే నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడని చెప్పాలి. సినిమాల ఫ్రీక్వెన్సీ, రేంజ్ పరంగా దేవి కూడా అతణ్ని అందుకునే స్థితిలో లేడు.
ఐతే ఎప్పటికప్పుడు భారీ సినిమాలు చేస్తున్నా, మంచి ఆల్బమ్స్ ఇస్తున్నా సరే.. టాలీవుడ్లో తమన్ ఎదుర్కొన్నంత విమర్శలు, ట్రోలింగ్ ఎవరికీ ఎదురు కాలేదంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం అతను ఒక టైంలో ఒకే రకమైన ఊకదంపుడు పాటలు చేయడం, కొన్ని ఇంటర్నేషనల్ పాటల్ని కాపీ కొట్టడం, అలాగే తన ట్యూన్స్‌నే రిపీట్ చేయడం. గత మూణ్నాలుగేళ్ల నుంచి టాప్ ఫాంలో ఉంటూ వరుసగా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లు ఇస్తున్నా సరే.. అప్పుడప్పుడూ అతడి పాటలు, బ్యాగ్రౌండ్స్ స్కోర్స్ ట్రోలర్స్‌కు టార్గెట్ అయిపోతున్నాయి.
తమన్ నుంచి ఏదో కొత్త పాట.. లేదా స్కోర్ బయటికి రావడం.. ముందు దాని మీద ప్రశంసల జల్లు కురవడం.. తర్వాత అది ఎక్కడ్నుంచో ఇన్‌స్పైర్ అయిన మ్యూజిక్ అని తేలి ట్రోలింగ్ జరగడం.. ఇదీ వరస. తమన్ తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’కి ఇచ్చిన స్కోర్ సోషల్ మీడియాను షేక్ చేసింది.
పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ కావాలని ముందు కోరుకున్నారు కానీ.. ‘ఓజీ’ టీజర్‌కి తమన్ ఇచ్చిన స్కోర్ చూసి ఆహా ఓహో అన్నారు. అనిరుధ్ అయినా ఇలాంటి స్కోర్ ఇచ్చేవాడు కాదేమో అన్న కామెంట్లు కూడా వినిపించాయి. కానీ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చిన ఈ స్కోర్ కూడా ఒరిజినల్ కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్ప్లాషర్ అనే మ్యూజిక్ ఆల్బం నుంచి ఇన్‌స్పైర్ అయి తమన్ ‘ఓజీ’ సౌండ్స్ క్రియేట్ చేశాడని అంటున్నారు. రెండు మ్యూజిక్స్‌ను పక్క పక్కన పెట్టి వింటే ఒకే రకంగా అనిపిస్తున్నాయి. దీంతో యధావిధిగా ట్రోలర్స్ ఒక రేంజిలో తమన్‌ను ఆడుకున్నంటున్నారు.