బోణీ బాగుంది.. నిలబెట్టుకుంటే చాలు

నిన్న విడుదలైన ఖుషికి డీసెంట్ రివ్యూస్ తో పాటు పబ్లిక్ టాక్ కూడా బాగానే ఉంది. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు కానీ వీకెండ్ లో ఫ్యామిలీస్, యూత్ చూసేందుకు ఒకే ఒక బెస్ట్ ఆప్షన్ గా విజయ్ దేవరకొండ సినిమానే నిలుస్తోంది. ముఖ్యంగా పాటలు, యూత్ ఎలిమెంట్స్, లైట్ ఎమోషన్స్ తో థియేటర్లకు వెళ్లేందుకు ఈ మాత్రం చాలనుకుంటున్న ఆడియన్స్ బాగానే ఉండటంతో మంచి ఫిగర్లు నమోదవుతున్నాయి. ట్రేడ్ నుంచి అందిన రిపోర్ట్ మేరకు ఖుషి ఫస్ట్ డే 9 కోట్ల 80 లక్షల దాకా వసూలు చేసిందట. లైగర్ కన్నా ఓ ముప్పై లక్షలు ఎక్కువే వచ్చిందని వార్త.

సాయంత్రానికి ఆక్యుపెన్సీలు పెరగడం ఖుషికి శుభ సూచకం. శని ఆదివారాలు అడ్వాన్స్ ట్రెండ్స్ బాగుండటం పట్ల బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలో దిగిన ఖుషి ఎల్లుండి సోమవారం నుంచి కూడా మంచి హోల్డ్ కొనసాగిస్తే హిట్టు స్టేటస్ ఖాయం. అయితే ఇలాంటి ఎంటర్టైనర్లను ఖచ్చితంగా అంచనా వేయలేం. గతంలో అంటే సుందరానికి ఇదే తరహాలో బాగుందనే మాట తెచ్చుకుంది కానీ తీరా చూస్తే ఫైనల్ రన్ అయ్యేసరికి నష్టాలే మిగిలాయి. ఖుషికి అలాంటి రిస్క్ లేదని చెప్పలేం కానీ బెటర్ గా ఉన్న మాట వాస్తవం.

బాక్సాఫీస్ బరిలో పోటీ లేకపోవడం ఖుషికి మరో పెద్ద సానుకూలాంశం. జైలర్ డెడ్ ఎండ్ కి వచ్చేసింది. ఓటిటి డేట్ ఇచ్చేశారు కాబట్టి ఇక అదే పనిగా థియేటర్లకు వచ్చే జనం పెద్దగా ఉండరు. సో ఖుషి సోలో రన్ ని సెప్టెంబర్ 7 వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు వచ్చే షారుఖ్ ఖాన్ జవాన్ కు ఎలాంటి టాక్ వస్తుందనేది కీలకంగా మారనుంది. అది బ్లాక్ బస్టర్ అనిపించుకుందా ఖుషికి ఇబ్బంది తప్పదు. లేదూ సోసో అన్నారంటే ఇంకో అవకాశం దక్కుతుంది. అయితే రేస్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఏదైతేనేం ఖుషి బోణీ కొట్టేసింది కనక నిలబెట్టుకోవడమే తరువాయి.