ముకుంద అనే ఫ్లాప్ మూవీతో కెరీర్‌ను ఆరంభించినప్పటికీ.. ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి హిట్లు వరుణ్ తేజ్‌కు మంచి పేరు, ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ భిన్నమైన దారిలో నడిచాడు ఈ మెగా కుర్రాడు. ఈ మధ్య అతడికి అస్సలు కలిసి రావడం లేదు. వరుస డిజాస్టర్లు తన మార్కెట్‌ను బాగా దెబ్బ కొట్టేశాయి. వరుణ్ భవిష్యత్ చిత్రాల మీద అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
గత ఏడాది వేసవిలో వచ్చిన ఎఫ్-3 మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఇది మల్టీస్టారర్ మూవీ కాబట్టి పర్వాలేదు. కానీ సోలో హీరోగా వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన గని మూవీ గత ఏడాది అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కరవయ్యాయి.
దీని తర్వాత తానునటించిన గాండీవధారి అర్జున మీద వరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా గని లాగే వాషౌట్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర మినిమం ఎఫెక్ట్ చూపించలేకపోయింది ఈ చిత్రం. వరుణ్ మార్కెట్ ఇంత వీకా అన్న సందేహాలు కలిగాయి. వరుసగా రెండు చిత్రాలు డిజాస్టర్లు కావడం.. వాటికి కనీసం ఓపెనింగ్స్ లేకపోవడం వరుణ్ బాక్సాఫీస్ సత్తాను ప్రశ్నార్థకం చేసేవే. అయితే ఇప్పటికే అతను కమిటైన రెండు సినిమాలు పెద్ద బడ్జెట్లో తెరకెక్కుతున్నాయి.
ఆపరేషన్ వాలెంటైన్ పేరుతో అతనో హిందీ-తెలుగు బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు కరుణ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా కూడా పెద్ద బడ్జెట్ సినిమానే. వీటి మీద భారీ పెట్టుబడులు పెడుతున్న నిర్మాతలకు గని, గాండీవధారి అర్జున్ ఫలితాలు కంగారు పెడుతున్నాయి. ఆ సినిమాలను అనుకున్న ప్రకారం పూర్తి చేసి.. తాము కోరుకున్న బిజినెస్ చేయడం చాలా కష్టమయ్యేలా కనిపిస్తోంది. మరి వాటిని వరుణ్ ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి.