తాజాగా జరిగిన ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం గురించి సినీ సర్కిల్స్, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి తమకు అనుకూలమైన వెర్షన్లు ప్రచారంలోకి తెస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా రాకపోవడం కొన్ని అనుమానాలు రేపినప్పటికీ అసలేం జరిగిందనేది కేవలం ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఇటీవలే నందమూరి సుహాసిని కొడుకు వివాహానికి బాలయ్య, మోక్షజ్ఞ, తారక్ తో సహా అందరూ హాజరైనా దానికన్నా ఎక్కువగా ఇప్పుడీ కాయిన్ ఈవెంట్ నే హైలైట్ చేయడం గమనించాల్సిన విషయం.
అభిమానుల్లో సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి రాకుండా ఉండవు. కానీ స్పందించకుండా ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే తనిస్తున్న అత్యుత్తమ సమాధానం. ఎందుకంటే ఇప్పుడే వివరణ ఇచ్చినా దానికి రకరకాల అర్థాలు తీస్తారు. దేవర షూటింగ్ ఉందంటే మరి కొరటాల శివ బన్నీ ఇంటికి ఎలా వెళ్లాడంటారు. లేదూ తనకు కుదరలేదన్నా ఇష్టం లేదన్నా చిలవలు పలవలుగా రాసేస్తారు. ఆ మధ్య చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి మీద అధికార పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తారక్ ఖండిస్తూ వీడియో చేస్తే దాని గురించీ శల్యపరీక్ష చేయడం గుర్తేగా
సున్నితమైన ఇలాంటి విషయాల పట్ల కొంత కాలం సైలెంట్ గా ఉండటమే మంచిది. ఎన్నికలు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థులకు సంబంధించిన ఏ అంశమైనా సరే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే శక్తులు పొంచి ఉన్నాయి. దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీతో మార్కెట్ ని విస్తృతపరుచుకునే పనిలో ఉన్న తారక్ కి ఇప్పుడివి అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ఇంటర్నేషనల్ ఫేమ్ ని నిలబెట్టుకోవాలి. అలాంటప్పుడు ఫోకస్ దాని మీదే ఉంచడం వల్ల ఎలాంటి డీవియేషన్లు ఉండవు. అందుకే కొన్ని సందర్భాల్లో మౌనాన్ని మించిన గొప్ప పరిష్కారం లేదని పెద్దలు ఊరికే అనలేదు.