సూపర్ స్టార్ రజనీకాంత్ సరికొత్త బ్లాక్ బస్టర్ జైలర్ కు హఠాత్తుగా పెద్ద షాక్ తగిలింది. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి చాలా స్పష్టమైన క్వాలిటీ, డాల్బీ సౌండ్ కూడిన హెచ్డి ప్రింట్ లీకైపోవడంతో ఒక్కసారిగా అభిమానులు బిత్తరపోయారు. ఏకంగా 10 జిబి సైజుతో వివిధ పైరసీ సైట్లలో అందుబాటులోకి రావడంతో క్షణాల్లో ఆ వార్త వైరలైపోయింది. తొలుత ఫేకని కొందరు భావించారు కానీ తీరా డౌన్ లోడ్ చేసుకుని చూసాక ఆ క్లారిటీకి మతి పోవడం ఒక్కటే తక్కువ. ప్రొడక్షన్ హౌస్ ఇస్తే తప్ప ఇంత నాణ్యత బయటికి రాదు. అలాంటిది ఎవరు లీక్ చేసుంటారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది.
కట్టడి చేసేలోపే రాత్రికి రాత్రే ఇది దావానలంలా పాకిపోయింది. కేవలం తమిళ ఆడియోతోనే అందుబాటులో ఉన్నప్పటికీ పైరసీ వీరులు ఇతర బాషల థియేటర్ సౌండ్ మిక్స్ చేసి మరీ తమ వీక్షకులకు అందిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిందని, కుట్ర చేసిందెవరో బయట పెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. జైలర్ ఓటిటి, శాటిలైట్ ప్రీమియర్లను సన్ నెక్స్ట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటోంది. వ్యూస్, టిఆర్పిలో సరికొత్త రికార్డులు నమోదవుతాయనే ఉద్దేశంతో ఫుల్ రన్ అయ్యాక డేట్ డిసైడ్ చేయబోతోంది
ఈ లోగా ఇలాంటి షాక్ తగలడం విచారకరం. ఏదో మాములు ప్రింట్ అయితే ఇంత కలకలం ఉండేది కాదు కానీ హెచ్డి అవ్వడం వల్ల ఇది హాట్ టాపిక్ గా మారింది. వీక్ డేస్ లో నెమ్మదించినా వారాంతంలో జైలర్ వసూళ్లు చాలా బాగా నమోదవుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ ఆరు వందల కోట్లు దాటేసిన తలైవర్ వెయ్యి మార్కు అందుకోవడం అసాధ్యంగా అనిపిస్తున్నా జపాన్, మలేషియా తదితర దేశాల్లో రిలీజ్ చూశాకా సులభంగా అందుకుంటారనే అంచనాలు బలంగా ఉన్నాయి. అయినా టెక్నాలజీ ఇంత పెరిగిన రోజుల్లోనూ పైరసీ ఈ స్థాయిలో జడలు విరబోసుకోవడం నిర్మాతలందరినీ వణికిస్తున్న సమస్య.