మంచి ఇమేజ్‌ను చెడగొట్టుకుంటున్నారే..

ఛాయ్ బిస్కెట్.. ఈ పేరు వింటే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది తెలుగు నెటిజన్లకు. మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్, మీమ్స్, షార్ట్ ఫిలిమ్స్‌తో ఈ సంస్థ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ముందు వెబ్ సైట్‌గా మొదలై.. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ తీసి.. ఆపై ఫీచర్ ఫిలిం ప్రొడక్షన్లోకి కూడా దిగింది ఛాయ్ బిస్కెట్. సుహాస్, సందీప్ రాజ్ సహా చాలా మంది యువ ప్రతిభావంతులు ఈ సంస్థ ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఛాయ్ బిస్కెట్ వాళ్లు తీసిన ‘30 వెడ్స్ 21’ యూట్యూబ్‌లో ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.

ఛాయ్ బిస్కెట్ ప్రాడక్ట్ అంటే అందులో ఒక అభిరుచి, కొత్తదనం ఉంటుందనే గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుతోనే ఛాయ్ బిస్కెట్‌ సంస్థ అధినేతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఫిలిం ప్రొడక్షన్లోకి కూడా అడుగుపెట్టారు. మహేష్ బాబు భాగస్వామ్యంలో ‘మేజర్’ సినిమా తీసి మంచి ఫలితాన్నందుకున్నారు. ఆ తర్వాత ఈ సంస్థ సోలోగా ప్రొడ్యూస్ చేసిన ‘రైటర్ పద్మభూషణ్’ కూడా మంచి ఫలితాన్నందుకుంది.

ఛాయ్ బిస్కెట్ ఇక నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని అనుకుంటే.. ఆ సంస్థ నుంచి వచ్చిన ‘మేమ్ ఫేమస్’ నిరాశ పరిచింది. షార్ట్ ఫిలిం కంటెంట్‌తో ఫీచర్ ఫిలిం తీసి క్యాష్ చేసుకోవాలని చూశారనే విమర్శలు వచ్చాయి ఈ సినిమా రిలీజ్ టైంలో. ఐతే ‘మేమ్ ఫేమస్’ మీద వచ్చిన విమర్శలను ఛాయ్ బిస్కెట్ అధినేతల్లో ఒకరైన శరత్ చంద్ర అస్సలు తట్టుకోలేకపోయాడు. దీని మీద పెద్ద డిబేట్ పెట్టాడు. నెటిజన్లతో వాగ్వాదాలు చేశాడు.

సినిమా మీద వచ్చిన అబ్యూజివ్ కామెంట్లను తిప్పి కొట్టడం ఓకే కానీ.. ఈ సినిమా బాలేదన్న వాళ్లతో గొడవ పెట్టుకోవడమే అభ్యంతరకరమైంది. ఇప్పుడు ఛాయ్ బిస్కెట్ నుంచి వచ్చిన ‘బాయ్స్ హాస్టల్’ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇదే సమయంలో ‘మేమ్ ఫేమస్’కు వ్యతిరేకంగా రివ్యూ ఇచ్చిన ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిని బెదిరించడం.. అతడి మీద కేసు కూడా పెట్టడం.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ గొడవ పెద్దదై శరత్ చంద్ర తన ట్విట్టర్ అకౌంట్‌నే డెలీట్ చేసుకునేవరకు వెళ్లింది. విమర్శలను స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఈ వివాదాలేంటి.. తమ స్థాయికి తగని సినిమాలతో పేరు దెబ్బ తీసుకోవడం.. పైగా అవసరం లేని వివాదాల్లోకి వెళ్లడం.. ఇదంతా ఛాయ్ బిస్కెట్‌కు ఉన్న మంచి ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేదే అనడంలో సందేహం లేదు.