మొత్తం బన్నీనే.. దేవి ఎక్కడ?

జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా మన తెలుగు వాడు పురస్కారం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటిదాకా రమేష్ నాయుడు, కీరవాణి, తమన్‌లకు మాత్రమే ఆ గౌరవం దక్కింది. కేవీ మహదేవన్, ఇళయరాజా, విద్యాసాగర్ తెలుగు చిత్రాలకు ఈ పురస్కారం అందుకున్నారు కానీ.. వాళ్లు తెలుగు వాళ్లు కాదు. నిజానికి తమన్‌కు తెలుగు మూలాలున్నప్పటికీ.. అతను పెరిగిందంతా చెన్నైలో కాబట్టి తమిళుడిగానే చూస్తారు.

ఐతే ఇప్పుడు ‘పుష్ప’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైన దేవిశ్రీ ప్రసాద్.. అచ్చ తెలుగు కుర్రాడు. అతడి బేస్ కూడా చెన్నైయే అయినా తెలుగువాడిగానే చూస్తారు. మరి మన తెలుగు వాడికి దేశంలో అత్యున్నత సంగీత పురస్కారం దక్కితే.. తెలుగు వాళ్లు సరైన రీతిలో సెలబ్రేట్ చేశారా అంటే లేదనే చెప్పాలి. మీడియాలో, సోషల్ మీడియాలో.. ఇండస్ట్రీ వర్గాల్లో దేవిశ్రీకి పురస్కారం దక్కడంపై పెద్ద చర్చే లేదు. మీడియా కవరేజీ అయితే నామమాత్రంగా ఉంది.

దేవిశ్రీ మీడియాలో సహా ఎక్కడా హైలైట్ కాకపోవడానికి పరోక్షంగా అల్లు అర్జునే కారణం అని చెప్పాడు. అతను పుష్ప సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో లీడ్ యాక్టర్‌గా జాతీయ అవార్డు గెలిచిన నటుడు బన్నీనే. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో అతడి పేరే హోరెత్తుతూ వచ్చింది. అతనే పతాక శీర్షికలను ఆక్రమించేశాడు. నాలుగు రోజులు గడుస్తున్నా బన్నీకి అవార్డు దక్కడంపై మీడియాలో, సోషల్ మీడియాలో హడావుడి తగ్గలేదు. అతను అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు.

పార్టీలు, సెలబ్రేషన్ల సంగతి సరేసరి. రోజూ సినీ ప్రముఖులు వెళ్లి అతణ్ని అభినందిస్తున్న ఫొటోలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో దేవిశ్రీ గురించి డిస్కషనే లేదు. అతను చెన్నైలో సైలెంటుగా పని చేసుకుంటున్నట్లున్నాడు. బన్నీకి రాకుండా దేవి ఒక్కడికే అవార్డు వచ్చి ఉంటే మాత్రం అతడి పేరు మార్మోగేది అనడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే బన్నీతో కలిపి అవార్డుకు ఎంపిక కావడం దేవి బ్యాడ్ లక్. ఈసారి ఏకంగా టాలీవుడ్‌కు 11 జాతీయ అవార్డులు రావడంతో విజేతలకు సన్మాన కార్యక్రమం లాంటిది ఏదైనా ప్లాన్ చేసినా.. అంతమందిలో దేవికి రావాల్సిన గుర్తింపు రావడం కష్టమే.