వకీల్ సాబ్ కి వసూల్ సీజన్!

వకీల్ సాబ్ మొదలు పెట్టినపుడు ఈ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేసారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో దసరాకి వెళుతుందని భావించారు. కానీ తాజా అంచనాల ప్రకారం వకీల్ సాబ్ వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందని అంటున్నారు. షూటింగ్స్ మళ్ళీ ఆగష్టు, సెప్టెంబర్ నాటికి నెమ్మదిగా గాడిన పడినా కానీ థియేటర్లు డిసెంబర్ నుంచి కానీ సరిగ్గా నడవవు అని భావిస్తున్నారు కనుక వకీల్ సాబ్ ని సంక్రాంతి కోసం సిద్ధం చేయవచ్చు.

వేసవిని మిస్ చేసుకున్న ఈ సినిమాకి సంక్రాంతి అయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మరీ ఈ ఏడాది మాదిరిగా వసూళ్ల సీజన్లో కనక వర్షం కురవక పోయినా కానీ సంక్రాంతి సందడి అయితే ఖచ్చితంగా బాగుంటుంది. అప్పటికి పవన్ సినిమా విడుదల అయి మూడేళ్లు అవుతుంది కనుక ఆ క్రేజ్ కూడా తోడవుతుంది.

ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయిన తర్వాత పవన్ కాల్ చేసి దిల్ రాజుతో డేట్స్ గురించి వర్రీ కావద్దని చెప్పాడట. షూటింగ్స్ ఎప్పుడు మళ్ళీ నార్మల్ గా జరుగుతోంటే అప్పట్నుంచీ తన డేట్స్ ఖాయం చేసుకోమన్నాడట. వకీల్ సాబ్ పూర్తయ్యాకే ఏదైనా చేస్తానని అని మాట ఇచ్చాడట.