గుడుంబాతో ఖుషీకి రిస్క్ ఉంటుందా

ఈ వారం విడుదలైన సినిమాల్లో దేనికీ అన్ని వర్గాల నుంచి సూపర్ హిట్ టాక్ రాకపోవడంతో అందరి చూపు వచ్చేవారం వైపు వెళ్తోంది. విజయ్ దేవరకొండ ఖుషికి రంగం సిద్ధమవుతోంది. సమంతను తీసుకొచ్చి మ్యూజికల్ కన్సర్ట్ చేయించాక మళ్ళీ విడిగా  ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్లానింగ్ ఉన్నట్టు కనిపించడం లేదు. బిజినెస్ మాత్రం క్రేజీగా చేశారు. అరవై కోట్ల దాకా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీకి అందులోనూ ముందు సినిమాలు ఫ్లాప్ ఉన్న హీరో దర్శకుడి కాంబినేషన్ కి ఇంత హైప్ అంటే అది క్యాస్టింగ్ తాలూకు ఇమేజ్ ఫలితమే.

ఇదంతా ఓకే కానీ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుడుంబా శంకర్ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ మెన్ రికార్డులు దాటాలని పవర్ స్టార్ అభిమానులు కంకణం కట్టుకున్నారు. నిజానికిది ఒరిజినల్ గా విడుదలైన టైంలో అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. మణిశర్మ పాటలు, పవన్ మ్యానరిజం మరీ డిజాస్టర్ కాకుండా కొంత మేర కాపాడాయి. కానీ ఇప్పుడంతా ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు. వింటేజ్ కళ్యాణ్ ని తెరమీద చూసుకుని మురిసిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మధ్య ఖుషికి చూసిన రెస్పాన్స్ మళ్ళీకి దీనికి ఉండొచ్చని అంచనా.

ఒక కొత్త సినిమాకు ఇలాంటి పోటీ అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గ్యాప్ ఒక్క రోజే కాబట్టి ప్రభావమైతే ఉంటుంది. ముఖ్యంగా ఖుషికి వచ్చే ఫస్ట్ డే కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మధ్య యువత రీ రిలీజులను ఒక వ్యసనంలా మార్చేసుకుంటున్నారు. ఎంతగా అంటే ధనుష్ రఘువరన్ బిటెక్ కి సైతం ఈలలు కేకలతో పైకప్పులు ఎగిరిపోయేంత అల్లరి చేసే దాకా. అందుకే గుడుంబా శంకర్ ని తక్కువంచనా వేయడానికి లేదు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సరిపడా స్క్రీన్లు ఖుషికి ఎలాగూ దొరుకుతాయి కానీ ఎటొచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటేనే ఓ రెండు రోజులు గుడుంబా ముప్పు ఉండదు.