ఉప్పెన సిగలో జాతీయ పురస్కారం

అరవై తొమ్మిదవ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు సినిమాగా ఉప్పెన పురస్కారం అందుకుంది. 2021లో సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు పంపిన నామినేషన్లుగా వచ్చిన వాటిలో ఉప్పెనకి అన్ని అర్హతలు ఉన్నాయని గుర్తించి ప్రకటించడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి వంద కోట్లకు పైగా గ్రాస్ తో సంచలనం రేపింది. సుకుమార్ మార్గదర్శకత్వంలో శిష్యుడు సాధించిన ఘనత గోపా జ్ఞాపకం.

ఒకపక్క పుష్పకు మరో రెండు అవార్డులు వచ్చిన నేపథ్యంలో మైత్రి సంస్థ ఆనందం మాములుగా లేదు. ఉప్పెన విడుదలకు ముందు కరోనా ఉధృతంగా ఉండేది. ఒకదశలో ఓటిటిలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ చిరంజీవి ఫైనల్ కాపీ చూశాక ఇది థియేటర్లకే వదలమని సలహా ఇవ్వడం, దాని కోసం ఆర్థిక భారాన్ని భరించి నిర్మాతలు ఎదురు చూడటం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఉప్పెన ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్, తొలి పరిచయంగా కృతి శెట్టి పరిచయమయ్యారు. విజయ్ సేతుపతి విలనీ, దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఓ రేంజ్ లో యువతకు కనెక్ట్ అయిపోయాయి.

కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు ఇలాంటి గుర్తింపు రావడం పట్ల ఉప్పెన సృష్టికర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న యూత్ హీరో హీరోయిన్ల డెబ్యూ మూవీకి జాతీయ అవార్డు దక్కడం ఈ మధ్య కాలంలో ఎవరికీ జరగలేదు. సున్నితమైన అంశానికి కులాల అంతరాలను ఆధారంగా చేసుకుని, హీరో పాత్రకు ఊహించని షాకింగ్ ట్విస్టు ఇవ్వడం ప్రేక్షకులను కదిలించింది. చిన్నపాటి రొమాంటిక్ సాంగ్ ఉన్నప్పటికీ బలమైన ఎమోషన్లు, నిజమైన ప్రేమకు నిర్వచనంగా నిలిచిన ఉప్పెన నిజంగానే ఈ గౌరవానికి తగినదే. ఈ వార్త వినగానే క్రూ అండ్ కాస్ట్ మొత్తం సంబరాల్లో మునిగి తేలింది.