ప్రభాస్‍కి కూడా అతడే విలన్‍!

‘తానాజీ’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓం రౌత్‍ దర్శకత్వంలో ప్రభాస్‍ కొత్త సినిమా ‘ఆదిపురుష్‍’ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్‍ నేరుగా బాలీవుడ్‍లో అడుగుపెడుతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో ప్రభాస్‍కి దేశవ్యాప్తంగా గ్యారెంటీ మార్కెట్‍ వుందని తేలడంతో ‘ఆదిపురుష్‍’ని భారీ స్థాయిలో ప్లాన్‍ చేస్తున్నారు.

ఇందులో విలన్‍ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. కానీ ఓం రౌత్‍ గత చిత్రం ‘తానాజీ’లో విలన్‍గా నటించిన సైఫ్‍ అలీ ఖాన్‍ ఇందులోను విలన్‍గా నటించనున్నాడని సమాచారం. రావణుడి పాత్ర కోసం సైఫ్‍ తన ఆకారాన్ని మార్చుకోనున్నాడట. హీరోగా సైఫ్‍ నటిస్తోన్న సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో అతను వెబ్‍ సిరీస్‍ల వైపు వెళ్లిపోయాడు.

అలాంటి టైమ్‍లో ‘తానాజీ’తో సైఫ్‍కి పెద్ద హిట్‍ ఇచ్చాడు ఓం రౌత్‍. అతడే ప్రభాస్‍కి కూడా విలన్‍గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వస్తుందని అంటున్నారు. ఇక సీతగా నటించే హీరోయిన్‍ కోసం అన్వేషణ సాగుతోంది. బాలీవుడ్‍ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి కథానాయికగా ఎంపిక కానుంది.