ఘట్టమనేని అభిమానుల్లో విపరీతమైన అనుమానాలు, ఉత్సాహాలు రేపుతున్న గుంటూరు కారం 2024 సంక్రాంతికి విడుదలవుతుందా లేదానే డౌట్లకు స్వయంగా మహేష్ బాబే చెక్ పెట్టేశాడు. బిగ్ సి రెండు దశాబ్దాల వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఖచ్చితంగా పండగకు వస్తామని క్లారిటీ ఇచ్చేశాడు. నిర్మాత నాగవంశీ ఆ వీడియో బిట్ ని షేర్ చేస్తూ జనవరి 12 రిలీజ్ డేట్ ని నొక్కి వక్కాణిస్తూ రీ ట్వీట్ చేయడంతో ఇక ఈ విషయంలో అన్ని చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే. చాలా గ్యాప్ తర్వాత మహేష్ ఎక్కువ సేపు కెమెరా ముందు గడిపిన సమావేశం ఇదే.
ఇంకో నాలుగు నెలల పది రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో వేగం పెంచబోతున్నారు. రమ్యకృష్ణ డేట్లతో ఏదో సమస్య వచ్చిందనే వార్త ప్రచారమయ్యింది కానీ అందులో వాస్తవం లేదు. హైదరాబాద్ లోనే ప్లాన్ చేసుకున్న కీలక భాగంలో ఆవిడతో పాటు మహేష్ కూడా పాల్గొంటున్నాడు. తమన్ స్వరపరిచిన పాటల్లో రెండు ఆల్రెడీ ఓకే అయ్యాయట. ఫైనల్ రికార్డింగ్ అవ్వగానే మొదటి లిరికల్ వీడియో ఎప్పుడు వదలాలో నిర్ణయించుకుంటారు. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఉండొచ్చు.
ఈ శుభవార్త వినగానే మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా గాసిప్పులు, మార్పులు, బ్రేకులు, హీరో విదేశీ ప్రయాణాలు, పవన్ కి త్రివిక్రమ్ ఇచ్చిన కమిట్ మెంట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల గుంటూరు కారం కొంత ఆలస్యమైనా మాట వాస్తవమే. అయినా కూడా ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే సంకల్పంతో టీమ్ ఉంది. రవితేజ ఈగల్, తేజ సజ్జ హనుమాన్ లు ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్నాయి. ప్రాజెక్ట్ కె వచ్చేది లేనిది ఇంకా ఖరారు కాలేదు. గుంటూరు కారం కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి రావాలనుకున్న ఒకరిద్దరు డ్రాప్ అవ్వొచ్చు.