వరుస ఫెయిల్యూర్లు.. మార్కెట్ పతనం.. ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ప్రభావం.. ఇదంతా చూసి సూపర్ స్టార్ రజినీకాంత్ పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు. రజినీ అభిమానులు పునర్వైభవం అసాధ్యమే అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ టైమింగ్ కలిసి వస్తే సూపర్ స్టార్ ఇప్పటికీ అద్భుతాలు చేయగలడని ‘జైలర్’ మూవీ రుజువు చేసింది.
యావరేజ్ కంటెంట్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. తొలి వీకెండ్లోనే ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. విడుదలైన తొమ్మిది రోజులకే ‘జైలర్’ రూ.500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. రజినీ ఈ దశలో ఈ క్లబ్బులోకి వస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. సౌత్ ఇండియాలో ఈ మైలురాయిని రెండుసార్లు అందుకున్న హీరోల్లో ప్రభాస్ తర్వాత రజినీ మాత్రమే ఉన్నాడు.
ప్రభాస్ ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో రెండుసార్లు 500 కోట్ల మైలురాయిని అందుకున్నాడు. రజినీ విషయానికి వస్తే.. గతంలో ‘2.ఓ’ చిత్రంతో తొలిసారి 500 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టాడు రజినీ. ఇప్పుడు ‘జైలర్’తో మళ్లీ ఆ మైలురాయిని టచ్ చేశారు. రజినీ కెరీర్లోనే కాక కోలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా ‘2.ఓ’ ఉంది. ఆ చిత్రం రూ.560 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది.
‘జైలర్’ దాన్ని దాటి కోలీవుడ్ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం లాంఛనమే అని చెప్పొచ్చు. యుఎస్‌లో మాత్రమే ఈ చిత్రం 5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్’ గ్రాస్ రూ.60 కోట్లు దాటిపోవడం విశేషం. ఒక్క తమిళనాడులో మాత్రమే వసూళ్లు రూ.200 కోట్లను దాటిపోయేలా ఉన్నాయి. కేరళ, కర్ణాటకల్లోనూ ‘జైలర్’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ వారం కూడా సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌లో పెద్దగా పోటీ లేకపోవడం ‘జైలర్’కు బాగా కలిసొస్తోంది.