‘జైలర్’ సినిమాలో ఆరంభం నుంచి చివరి దాకా ప్రధానంగా హైలైట్ అయింది రజినీకాంతే. కానీ తక్కువ నిడివిలో కనిపించినప్పటికీ కొందరు నటులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సెకండాఫ్‌లో వచ్చే సునీల్ కామెడీ ఎపిసోడ్‌లో ఒక నటుడు బాగా హైలైట్ అయ్యాడు. హీరోగా పెద్ద రేంజికి ఎదిగిపోవాలని ఆశపడే సునీల్ దగ్గర ఉంటూ అతడితో సినిమా తీస్తూ అన్ని విషయాల్లోనూ గైడ్ చేసే పాత్ర అది.
తమన్నాకు, సునీల్‌కు మధ్య రాయబారిలా ఉంటూ.. సునీల్ ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ తనవిగా చెప్పుకుని తమన్నాను ముగ్గులో దించుతాడు ఆ వ్యక్తి. సునీల్ లాగే అతను కూడా విగ్గు వాడుతూ కొన్ని సీన్లలో బాగానే నవ్వించాడా నటుడు. చూడ్డానికి కొంచెం ఫెమిలియర్ ఫేస్ లాగా అనిపించే ఈ నటుడు బేసిగ్గా తెలుగువాడే కావడం విశేషం. తన పేరు సునీల్ రెడ్డి.
టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి పెద్ద కొడుకే ఈ సునీల్ రెడ్డి. అతడి తమ్ముడు వైభవ్ రెడ్డి తెలుగులో ‘గొడవ’ సహా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ ఇక్కడ విజయవంతం కాలేకపోయాడు. కోదండరామిరెడ్డి ముందు నుంచి కుటుంబంతో సహా చెన్నైలోనే స్థిరపడ్డ సంగతి తెలిసిందే. దీంతో వైభవ్ కూడా తమిళ సినిమాల్లోకి వెళ్లి అక్కడ కొన్ని విజయాలందుకున్నాడు. తమ్ముడి తర్వాత సునీల్ రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అతను చాలా వరకు కామెడీ రోల్సే చేశాడు. సునీల్‌కు మంచి పేరు తెచ్చింది ‘డాక్టర్’ సినిమా. అందులో అతడి పాత్ర కడుపుబ్బ నవ్విస్తుంది. సునీల్‌కు ‘డాక్టర్’తో మంచి బ్రేక్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్.. ఆ తర్వాత ‘జైలర్’లోనూ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఇద్దరు సునీల్‌లు.. తమన్నాను ప్రేమించగా.. ఒక సునీల్ బకరా అయితే, ఇంకో సునీల్ తమన్నా మనసు గెలిచాడన్నమాట. తమిళంలో సునీల్ రెడ్డి ప్రస్తుతం కొంచెం బిజీగానే ఉన్నాడు.
Show quoted text