ప్రభాస్‌ను మ్యాచ్ చేయడం కష్టమబ్బా..

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిందే. దానికి ముందు చేసిన సినిమాతో పోలిస్తే అతడి మార్కెట్ పది రెట్లు పెరిగిందంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాది జనాలు కూడా అతణ్ని ఓన్ చేసుకున్నాడు. అక్కడా తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఓవరాల్‌గా డిజాస్టర్‌గా నిలిచిన ‘సాహో’ సినిమా హిందీలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లతో ‘హిట్’ స్థాయిని అందుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో ఊహించవచ్చు.

ఐతే ‘సాహో’ సినిమాతో నిరాశకు గురి చేయడం, దాని తర్వాత అతను చేసిన ‘రాధేశ్యామ్’కు ఆశించిన స్థాయిలో బజ్ లేకపోవడంతో ప్రభాస్ కొంచెం డౌన్ అయినట్లుగా కనిపించాడు. అదే సమయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్లు కొట్టి ప్రభాస్‌ను అందుకునే ప్రయత్నం చేశారు. ‘పుష్ప’తో బన్నీ.. ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్, ఎన్టీఆర్ కూడా ప్రభాస్ రేంజ్ అందుకుంటారని.. మరోవైపు వరుసగా సూపర్ హిట్లు ఇస్తున్న మహేష్ కూడా ప్రభాస్‌ను చేరువయ్యే దిశగా అడుగులేస్తున్నాడని అనుకున్నారు.

కానీ ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ప్లానింగ్ మారింది. ఆషామాషీ సినిమాలు చేస్తే తన ఇమేజ్ నిలబడదని అతడికి అర్థమైనట్లుంది. నాగ్ అశ్విన్‌తో ఓ వరల్డ్ క్లాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్లాన్ చేశాడు. దాని బడ్జెట్ రూ.300 కోట్ల పైనే అంటే రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా దీపికా పదుకొనేను హీరోయిన్‌గా పెట్టుకున్నారు. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను ట్రై చేస్తున్నారు. ఇప్పుడేమో ‘తానాజీ’ దర్శకుడు ఓమ్ రౌత్‌తో రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ పేరుతో ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ప్రభాస్.

ఈ రెండు చిత్రాలూ వరల్డ్ క్లాస్, భారీ చిత్రాలే అని అర్థమవుతోంది. ‘తానాజీ’ తర్వాత బాలీవుడ్లో సూపర్ స్టార్లు రౌత్‌తో పని చేసేందుకు రెడీగా ఉంటే.. అతను ప్రభాస్‌ను, అది కూడా రాముడి పాత్ర కోసం ఎంచుకున్నాడంటే మామూలు విషయం కాదు. కచ్చితంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అనిపిస్తోంది. ప్రభాస్ చేయబోయే రెండు సినిమాల రేంజ్, వాటి బడ్జెట్లు, వాటి రీచ్ చూస్తే అతణ్ని వేరే హీరోలు మ్యాచ్ చేయడం అంత తేలికైన విషయం కాదని.. అతడి లెవెల్ వేరని స్పష్టంగా తెలుస్తోంది. నార్త్ వరకే ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ స్టార్లకు కూడా ప్రభాస్‌ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.