బాలయ్యని మిస్ చేసుకున్న జైలర్

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ వసూళ్ల ఊచకోత మాములుగా లేదు. ముఖ్యంగా స్వంత రాష్ట్రంతో పాటు కేరళలో  సృష్టిస్తున్న  రికార్డులు మతులు పోగొడుతున్నాయి. అయితే ఇందులో ఇతర బాషల స్పెషల్ క్యామియోలు ఏ రేంజ్ లో పేలాయో చూస్తున్నాం. కన్నడ శివరాజ్ కుమార్, మలయాళం మోహన్ లాల్, హిందీ జాకీ శ్రోఫ్ లను తీసుకొచ్చి  దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ వాళ్ళను క్లైమాక్స్ లో రజని పాత్రకు లింక్ చేసిన విధానం సెకండ్ హాఫ్ లో నీరసాన్ని దాదాపుగా పోగొట్టింది. అయితే తెలుగు నుంచి ఎవరూ లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.

దీనికి నెల్సన్ దగ్గర సమాధానం ఉంది. బాలకృష్ణను ఇదే తరహాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా చూపించాలనుకున్నానని, కానీ ఆయన స్థాయికి సరిపడా ఆర్క్ ఉన్న పాత్ర సెట్ కాక ఆ ఆలోచన వదిలేయాల్సి వచ్చిందని ఒక తమిళ ఛానల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్ అవుతోంది. నిజంగానే జైలర్ చివరి ఫైట్లో పైన చెప్పిన ముగ్గురు స్టార్లతో పాటు బాలయ్య కూడా వీరసింహారెడ్డి గెటప్ లో చుట్ట వెలిగించుకుంటూ రౌడీలకు వార్నింగ్ఇచ్చి  ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవన్న మాట వాస్తవం. అయితే కథలో స్కోప్ లేక మిస్ చేసుకోవాల్సి ఉంది.

రజని బాలయ్య ఇద్దరికీ మంచి స్నేహం ఉంది. అందుకే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. వీళ్ళ ఆన్ స్క్రీన్ కాంబో కోసం మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ సాధ్యపడలేదు . స్వర్గీయ ఎన్టీఆర్ తో కలిసి రజనీకాంత్ టైగర్ అనే మూవీ చేశారు. మంచి విజయం సాధించింది. గొప్ప జ్ఞాపకంగా నిలిచింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో తెరను పంచుకునే ఛాన్స్ వస్తే ఆయన మాత్రం ఎందుకు వద్దంటారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఇంకొంచెం సీరియస్ హోమ్ వర్క్ చేసి ఉంటే ఈ కలయిక సాధ్యమయ్యేదేమో. బ్యాడ్ లక్.