వాళ్లెవ్వరినీ వాడుకోని ‘జైలర్’

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే.. దానికి ఆయనే ప్రధాన ఆకర్షణ అవుతారు. కొంచెం బలమైన విలన్ ఉంటే చాలు.. ఆర్టిస్టుల పరంగా పెద్ద ప్యాడింగ్ ఏమీ అవసరం లేదు. కానీ ‘జైలర్’ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ చాలామంది పేరున్న నటీనటులను తీసుకున్నాడు. రమ్యకృష్ణను రజినీ భార్యగా చూపిస్తూ.. తమన్నాకు కూడా ఒక రోల్ ఇచ్చాడు.

అంతే కాక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కన్నడ టాప్ స్టార్ శివరాజ్ కుమార్‌లకూ ఈ సినిమాలో చోటిచ్చాడు. ఇంకా మన సునీల్‌ను సైతం ఓ ముఖ్య పాత్ర కోసం ఎంచుకున్నాడు. ఈ కాస్టింగ్ చూసి ఏదో ఊహించుకున్నారు ప్రేక్షకులు. తీరా సినిమా చూస్తే అందరికీ నిరాశ తప్పలేదు. ‘జైలర్’లో రజినీకాంత్‌ది వన్ మ్యాన్ షో. ఆయన అభిమానులను సంతృప్తిపరచడానికే నెల్సన్ సినిమా తీసినట్లున్నాడు. రజినీని సూపర్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడంలో, ఎలివేషన్లలో నెల్సన్ విజయవంతం అయ్యాడు.

కానీ కథ విషయంలో అలాగే మిగతా పాత్రల విషయంలో నెల్సన్ పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. దాదాపుగా మిగతా ముఖ్య పాత్రలు పోషించిన నటీనటులందరూ వృథా అయ్యారనే చెప్పాలి. రజినీ భార్యగా రమ్యకృష్ణది లిమిటెడ్ రోల్. ఆమె ప్రత్యేకతను చాటే సన్నివేశం ఒక్కటీ లేదు. ప్రథమార్ధంలో అయినా అప్పుడప్పుడూ కనిపిస్తుంది కానీ సెకండాఫ్‌లో రమ్యకృష్ణ అంతర్ధానం అయిపోయింది. శివరాజ్ కుమార్ ఎంట్రీ బాగున్నా.. ఆయనదీ క్యామియో తరహా రోలే.

మోహన్ లాల్‌కు ఆ మాత్రం ప్రాధాన్యం కూడా లేదు. ఆ స్థాయి నటుడు చేయాల్సిన పాత్ర కాదిది. సునీల్ క్యారెక్టర్ తుస్సుమనిపించింది. సినిమాలో మేజర్ బ్యాక్‌డ్రాప్ సునీల్ మీద నడిచే కామెడీ ట్రాకే. ఈ ఎపిసోడ్లోనే తమన్నా కూడా కనిపించింది. కావాలయ్యా పాటలో ఆమె స్టెప్పులు అదరగొట్టినా సరే.. ఇలాంటి పాత్ర చేయాల్సి వచ్చినందుకు భవిష్యత్తులో చింతిస్తుందేమో. ఆమె రేంజ్ అంతగా పడిపోయింది ఆ పాత్రతో. మొత్తంగా ఇంత పెద్ద కాస్టింగ్‌ను పెట్టుకుని నెల్సన్ వాళ్లెవ్వరినీ వాడుకోవకపోవడం సినిమాకు చేటు చేసింది.