లేటు వయసులో ఇంత పెద్ద ఓపెనింగా  

మనవైపు పోటీని సూపర్ స్టార్-మెగాస్టార్ మధ్యే చూస్తున్నాం కానీ  బాలీవుడ్ లోనూ అచ్చం ఇలాంటి కాంపిటీషనే ఆగస్ట్ 11 నెలకొంది. గదర్ 2 ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుండటం చూసి ఓ మై గాడ్ 2 తెల్లబోతోంది. ఇప్పటిదాకా సన్నీ డియోల్ సినిమా 85 వేల టికెట్లు అమ్మేయగా ఇంకా రెండు రోజులు సమయం ఉంది కాబట్టి మొదటి షో పడేనాటికి లక్షన్నర సేల్స్ ఖాయమని బయ్యర్లు బల్లగుద్ది చెబుతున్నారు. అక్షయ్ కుమార్ బొమ్మ ఇంకా  యాభై వేలు కూడా అమ్మలేదు. 65 సంవత్సరాల సన్నీకి ఇంత పెద్ద ఓపెనింగ్ వచ్చి దశాబ్దాలు గడిచిపోయింది.

మెయిన్ స్ట్రీమ్ నుంచి ఎప్పుడో పక్కకు తప్పుకున్న సన్నీ డియోల్ ఏదో పాత్ర నచ్చితే హీరోగా సినిమాలు చేస్తున్నారు కానీ ఏవీ పెద్దగా ఆడలేదు. అయితే ఇరవై సంవత్సరాల బ్లాక్ బస్టర్ గదర్ కు కొనసాగింపనగానే మాస్ ఆడియన్స్ లో ఎక్కడ లేని జోష్ వచ్చింది. ముఖ్యంగా అందులో పాకిస్థాన్ ని ఎండగట్టే డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లు ఉండటంతో వాటి కోసం చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. 1971 ప్రాంతంలో లాహోర్ లో జరిగిన కథగా గదర్ 2 ఉంటుంది. పెరిగి పెద్దయిన కొడుకు శత్రుదేశంలో చిక్కుకుపోతే అతన్ని విడిపించేందుకు తండ్రి చేసే పోరాటమే ఈ సీక్వెల్.

రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని కంటెంట్ మీద మిశ్రమ స్పందన వచ్చినా వంద కోట్ల మార్కు సులభంగా దాటేసిన నేపథ్యంలో పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న గదర్ 2కి యావరేజ్ టాక్ వచ్చినా చాలు నార్త్ బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. దీని వల్ల ఓ మై గాడ్ 2 దూకుడు ఏ మాత్రం లేకపోయింది. ఒకవేళ ముందు ప్రకటించినట్టు రన్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగాల యానిమల్ కూడా ఇదే డేట్ కి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది వాయిదా పడటం సన్నీ, అక్షయ్ లకు పెద్ద ఊరట కలిగించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన గదర్ 2 లోనూ అమీషా పటేలే హీరోయిన్ గా నటించింది.