‘భోళా శంకర్’ నుంచి తప్పుకుంది అందుకా?

ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవితో  ఛాలెంజ్, అభిలాష‌, రాక్ష‌సుడు, మ‌ర‌ణ‌మృదంగం లాంటి సూపర్ హిట్  సినిమాలు తీసి క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బేన‌ర్ పేరు మార్మోగేలా చేసిన నిర్మాత కేఎస్ రామారావు. చిరంజీవికి నటుడిగా కూడా చాలా మంచి పేరు కూడా తెచ్చిపెట్టిన చిత్రాలివి. 90వ దశకం వరకు మంచి ఊపుమీదున్న రామారావు.. ఆ తర్వాత దెబ్బ తిన్నారు.

మధ్యలో కొడుకును హీరోగా చేస్తూ తీసిన ‘ఎవరే అతగాడు’ బాగా డబ్బులు పోగొట్టింది. దమ్ము, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలను ఆయన్ని నిండా ముంచేశాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత ఆయన ప్రొడక్షనే ఆపేశారు. ఆ టైంలోనే రామారావును ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు. తన కొడుకు రామ్ చరణ్‌ను రామారావుతో ఓ సినిమా చేయమని ఒక సినిమా వేడుకలో పేర్కొనడం తెలిసిందే. చరణ్‌తో కుదరకపోయినా.. చిరుతోనే ‘భోళా శంకర్’ నిర్మించే అవకాశం దక్కింది రామారావుకు.

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన ‘భోళా శంక‌ర్‌’లో అనిల్ సుంక‌ర‌తో పాటు రామారావును కూడా నిర్మాత‌గా చేర్చారు చిరు. ఈ సినిమాను ప్ర‌క‌టించిన‌పుడు.. ఆ త‌ర్వాత షూటింగ్ మొద‌ల‌య్యాక రామారావు ఇందులో భాగ‌స్వామిగానే ఉన్నారు. ఏప్రిల్లో ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసిన‌పుడు కూడా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బేన‌ర్ పేరు అందులో ఉంది. కానీ త‌ర్వాత ఉన్న‌ట్లుండి ఆ బేన‌ర్ పేరు ప్రోమోల నుంచి ఎగిరిపోయింది. రిలీజ్ ముంగిట నిర్మాత‌గా రామ‌బ్ర‌హ్మం సుంక‌ర పేరే క‌నిపిస్తోంది.

చిరు పనిగట్టుకుని రామారావును ఇందులో నిర్మాణ భాగస్వామిగా చేర్చి.. ఆ తర్వాత ఎందుకు తప్పించారో అర్థం కాలేదు. కానీ దీని వెనుక ఒక మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా టైంలో రామారావు తనకు బకాయి పడటంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా.. ‘భోళా శంకర్’ రిలీజ్ టైంలో సెటిల్ చేసుకోవాలని భావించారట. కానీ ఈ విషయం పసిగట్టే రామారావును నిర్మాత స్థానం నుంచి తప్పించారని అభిషేక్ నామా అనుమానిస్తూ నిర్మాణ మండలికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ‘భోళా శంకర్’ రిలీజ్ ముంగిట ఏం గొడవ జరుగుతుందో అని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.