ఏ ఇండస్ట్రీకీ అర్థం కాని మ్యాజిక్ ఇది

సినిమా అభిమానం విషయానికి వస్తే దేశంలో తెలుగు ప్రేక్షకుల తర్వాతే ఎవరైనా అనడంలో మరో మాట లేదు. పెద్ద స్టార్లు నటించే కొత్త సినిమాలకు మన వాళ్లు ఇచ్చే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మనది ప్రాంతీయ పరిశ్రమ అయినా సరే.. ఇండియా మొత్తం మార్కెట్ ఉన్న హిందీ సినిమాలను మించి ఓపెనింగ్స్ వస్తుంటాయి మన చిత్రాలకు. అడ్వాన్స్ బుకింగ్స్, ఫుట్ ఫాల్స్, తొలి రోజు, తొలి వీకెండ్.. ఇలా ఏ బెంచ్ మార్క్ తీసుకున్నా మన సినిమాలకు మిగతా భాషా చిత్రాలు సరితూగలేవు ఇప్పుడు.

ఐతే కొత్త సినిమాలకు ఇలాంటి ఆదరణ ఉండటం ఒక ఎత్తయితే.. ఎప్పుడో పదేళ్లు.. పదిహేనేళ్లు.. ఇరవై ఏళ్ల ముందు రిలీజైన సినిమాలను రీ రిలీజ్ చేసినా మన వాళ్లు వాటిని ఆదరించే తీరు చూసి షాకవ్వక తప్పని పరిస్థితి. ఈ ఓటీటీ కాలంలో పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం అన్నది అన్ని పరిశ్రమల వాళ్లూ మానేశారు. కానీ తెలుగులో మాత్రం ఏడాది నుంచి రీ రిలీజ్‌ల హంగామా నడుస్తోంది.

గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాకు పెద్ద ఎత్తున స్పెషల్ షోలు వేసినప్పటి నుంచి.. హంగామా మామూలుగా ఉండట్లేదు. ఈ ఏడాది వ్యవధిలో ఇలా 20 సినిమాల దాకా రిలీజయ్యాయి. కొన్ని సినిమాలకు జరిగిన బుకింగ్స్, వచ్చిన వసూళ్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. ఓవైపు ఇతర భాషల్లో కొత్త సినిమాలకే జనాలు లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. తెలుగులో మాత్రం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న పాత సినిమాలకు వందల షోలు ఫుల్స్ పడటం అనూహ్యం.

పెద్ద స్టార్ల సినిమాలకు హంగామా ఉందంటే అది వేరు. కానీ ‘3’ అనే డబ్బింగ్ సినిమాకు.. ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి చిత్రాలకు కూడా హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఇప్పుడు సూర్య అనువాద చిత్రం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ థియేటర్లలో నెలకొన్న హంగామా చూసి సూర్య సైతం ఆశ్చర్యపోతూ ట్వీట్ వేశాడు. ఇది తెలుగు ప్రేక్షకుల సినిమా పిచ్చికి నిదర్శనం. ఇది ఇతర ఇండస్ట్రీల వాళ్లకు ఏమాత్రం అర్థం కాని మ్యాజిక్.