ఇంకో మూడు రోజుల్లో ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వచ్చేస్తోంది. గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగల్ రావొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కానీ ఆ కానుక వచ్చే సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. తమన్ కంపోజింగ్ అయితే చేశాడు కానీ విదేశాల్లో ఉన్న మహేష్ బాబు ఓకే చేస్తే తప్ప బయటికి వదల్లేరు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్న మహేష్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ ప్రసక్తే లేదంటున్నారు. సర్కారు వారి పాట టైంలో తొందరపడటం వల్లే అల వైకుంఠపురం రేంజ్ ఆల్బమ్ రాలేదనే అభిమానుల ఫీలింగ్ హీరోకూ ఉన్నట్టు కనిపిస్తోంది.
ఒకవేళ పాట సిద్ధంగా ఉంటే ఈపాటికి కౌంట్ డౌన్ మొదలుపెట్టి సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసేవాళ్ళు. కానీ తమన్, నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ అకౌంట్లలో ఎలాంటి అప్డేట్ లేదు. హఠాత్తుగా ఒక రోజు ముందు హడావిడి చేస్తారని అనుకోలేం. మహా అయితే ఒక పోస్టర్ తప్ప అంతకు మించిన కంటెంట్ రాకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. అయితే అభిమానులు బిజినెస్ మెన్ రీ రిలీజ్ హడావిడిలో పడటంతో గుంటూరు కారం గురించి మేకర్స్ ని ఒత్తిడి చేయడం లేదు. లేకపోతే త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ లేదా తమన్ ని నిందిస్తూ ఈపాటికి బోలెడు ట్వీట్లు ట్రోల్స్ జరిగిపోయేవి.
ఒకరకంగా బిజినెస్ మెన్ వల్ల గుంటూరు కారంకు చాలా హెల్ప్ అయ్యింది. ప్రతిసారి తన కొత్త సినిమాల సంగతులను ఏదో ఒక రూపంలో గిఫ్ట్ గా ఇచ్చే మహేష్ బాబు హైదరాబాద్ లో లేకపోవడం కూడా ఈ ఆలస్యానికి కారణంగా తోస్తోంది. విడుదలకు ఎక్కుడ సమయం లేదు. ఇంకో అయిదు నెలల్లో రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. ఇంకా బ్యాలన్స్ టాకీ, పాటల చిత్రీకరణ పెండింగ్ ఉన్నాయి. ప్రమోషన్ల కోసం ఎంత లేదన్నా ఒక రెండు మూడు వారాలు రిజర్వ్ లో ఉంచుకోవాలి. ఇంత ఒత్తిడి మధ్య త్రివిక్రమ్ టీమ్ లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి మరి.