మన దగ్గర ఒకప్పుడు నంది అవార్డులకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి కానీ తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎవరెంత మొత్తుకున్నా చివరికవి మళ్ళీ పునఃజీవం అందుకోలేదు. ఆఖరికి ప్రైవేట్ వ్యక్తులు ఆ పురస్కారాలు ఇచ్చేందుకు సిద్ధమవ్వడం, దాన్ని నిర్మాతల సమాఖ్య ఖండించడం దాకా వెళ్ళింది వ్యవహారం. ఆ తర్వాత దీని కన్నా ఎక్కువ క్రేజ్ ఫిలిం ఫేర్ ఆ తర్వాత సైమాకు వచ్చింది. అంగరంగ వైభవంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తారాతోరణాన్ని మొత్తం ఒక చోట చేర్చి వేడుక జరిపే విధానం అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది.
ఈసారి బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ (అంటే హీరో) విభాగానికి పెద్ద చిక్కే వచ్చి పడేలా ఉంది. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ నామినేషన్లు పడ్డాయి. ఒకరికే ఇస్తే అదో తలనెప్పి. ఎవరినీ తక్కువ చేయడానికి లేదనేంత గొప్పగా రామరాజు, భీంలు పోటీపడి నటించారు. కాబట్టి ట్రిపులార్ కు జాయింట్ గా స్టేజి మీద ఒకేసారి ఇవ్వొచ్చు. లేదూ అంటే మిగిలిన నలుగురు కాంపిటీటర్లను చూడాలి. అడవి శేష్(మేజర్), దుల్కర్ సల్మాన్(సీతా రామం), నిఖిల్(కార్తికేయ 2), సిద్దు జొన్నలగడ్డ(డిజె టిల్లు) ఈ టైటిల్ కోసం రేస్ లో ఉన్నారు. దుబాయ్ లో సెప్టెంబర్ 15, 16 సైమా ఈవెంట్ జరుగుతుంది.
ఎలా లెక్కగట్టినా ఎక్కువ అవకాశాలు ఆర్ఆర్ఆర్ హీరోలకే ఉన్నాయి కానీ ఓట్ల శాతంతో పాటు ప్యానెల్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. సినిమా రిలీజ్ టైంలోనే ఇద్దరు హీరోల అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని సోషల్ మీడియాలో అర్థం లేని యుద్దాలు, ట్రోలింగ్ లు చేసుకున్నారు. అలాంటిది సైమాలో అవార్డు ఒకరికే ఇస్తే మళ్ళీ వేడి రాజుకుంటుంది. ఉభయకుశలోపరి నిర్ణయమే ఉండొచ్చు. లేదూ మిగిలిన నలుగురిలో ఒకరికి ఇచ్చేస్తే ఏ గొడవా ఉండదు. ఈ లెక్కన మల్టీస్టారర్ లకు ఇలాంటి చిక్కుముళ్లు కూడా ఉంటాయన్న మాట.