సూర్య బలం.. సూర్యకు తెలుస్తోందా?

తమిళ హీరో సూర్యను తెలుగు వారి దత్తపుత్రుడిగా పేర్కొంటూ ఉంటారు ఇండస్ట్రీ జనాలు. ఆయనకు ఏపీ-తెలంగాణ సెకండ్ హోమ్స్ లాగా అంటే అతిశయోక్తి కాదు. తమిళంలో సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కు దీటుగా ఇక్కడ కూడా ఆయనకు అభిమానగణం ఉన్నారు. ఒక టైంలో సూర్య సినిమాలు తమిళంతో సమానంగా తెలుగులో వసూళ్లు రాబట్టేవి కూడా.

తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లు ఇక్కడ పెద్ద రేంజిలో జరిగేవి. అలాగే రిలీజ్ కూడా భారీ స్థాయిలో ఉండేది. అందుకు తగ్గట్లే ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ సరైన సినిమాలు చేయకపోవడం వల్ల ఇక్కడ క్రేజ్, మార్కెట్ దెబ్బతింది. కానీ సరైన సినిమా చేస్తే ఇప్పుడు కూడా తెలుగులో సూర్య అభిమానుల హంగామా వేరుగా ఉంటుందనడానికి ఎప్పటికప్పుడు రుజువులు కనిపిస్తూనే ఉంటాయి.

తాజాగా సూర్య పాత సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ను తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఇది 15 ఏళ్ల కిందటి సినిమా. దీనికి ఈ వారం అంతా స్పెషల్ షోలు వేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఆ షోలను చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. మేజర్ సిటీస్‌లో ఉదయం 8 గంటల నుంచి షోలు మొదలవుతుంటే.. వాటికి టికెట్లు సోల్డ్ ఔట్ చూపిస్తుండటం షాకింగ్ విషయం. మన టాప్ స్టార్ల సినిమాలు రీ రిలీజ్ చేస్తే జనాలు ఎగబడి చూడటం.. హౌస్ ఫుల్స్ పడటం విశేషమేమీ కాదు.

కానీ తమిళ హీరో నటించిన అనువాద చిత్రం.. అది కూడా ఒక క్లాస్ మూవీకి ఇలాంటి క్రేజ్ ఉండటం అనూహ్యమైన విషయం. సూర్యకు తెలుగులో ఏ రేంజి ఫాలోయింగ్ ఉందనడానికి ఇది రుజువు. అతను సరైన సినిమాలు చేయాలే కానీ.. మళ్లీ తన తెలుగు అభిమానులు బ్రహ్మరథం పడతారు. అన్నీ కుదిరితే తమిళంను మించి తెలుగులో వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి తన స్టామినాను గుర్తించి సూర్య సినిమాల ఎంపికలో జాగ్రత్త పడాలి. ‘కంగువా’ సూర్యకు మళ్లీ తెలుగులో బంపర్ క్రేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నారు. చూడాలి ఏమవుతుందో?