OTT అభిమానులకు ఆగస్ట్ పండగ

చిరంజీవి, రజనీకాంత్ లాంటి పెద్ద హీరోల థియేట్రికల్ రిలీజులతో పాటు ప్రత్యేకంగా ఇంట్లోనే ఉంటూ వినోదాన్ని అందుకోవాలనే ఓటిటి ఫ్యాన్స్ కు ఆగస్ట్ నెల పండగలా మారనుంది. ఎల్లుండి 4న నాగశౌర్య ‘రంగబలి’ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేస్తుంది. ఫ్లాప్ కారణంగా చూడని ప్రేక్షకుల సంఖ్య భారీగా ఉండనుంది. 7న శ్రీసింహ కోడూరి ‘భాగ్ సాలే’ ఇదే ప్లాట్ ఫార్మ్ మీద చూసుకోవచ్చు. మూడో వారంలోకి అడుగు పెట్టగానే ‘ఆదిపురుష్’ పెట్టుకున్న రెండు నెలల గడువు పూర్తవుతుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ లో ప్రభాస్ దర్శనం చేసుకునే ఛాన్స్ దగ్గర్లోనే ఉంది. ప్రకటన మరికొద్ది రోజుల్లో రావొచ్చు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ‘హిడింబ’ హక్కులు ఆహా దగ్గర ఉన్నాయి. వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన సెన్సేషనల్ హిట్ ‘బేబీ’ని ప్రాధమికంగా ఆగస్ట్ 18న డిజిటల్ రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు. కానీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూషన్ పరంగా పెట్టుబడిలో అల్లు అరవింద్ కున్న భాగస్వామ్యం దృష్ట్యా ఆ డేట్ కి కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు కాబట్టి కొంత ఆలస్యం కావొచ్చు. ఇప్పటికే గత వారం సామజవరగమన, స్పై, రుద్రంగి, భువన విజయం లాంటి కొత్త మూవీస్ సందడి చేస్తున్నాయి

ఇవి కాకుండా జెడి చక్రవర్తి నటించిన ‘దయా’ ఈ శుక్రవారమే హాట్ స్టార్ లో రానుంది.  పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. జూలైలో ఓటిటి దూకుడు ఈ స్థాయిలో లేదు. పైగా ఆగస్ట్ 4న థియేటర్ పరంగా చెప్పుకునే సినిమాలు లేకపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకోవాలని డిసైడైన డిజిటల్ కంపెనీలు దానికి తగ్గట్టునే ప్లాన్ చేసుకున్నాయి. అయితే ఇన్నేసి ఆప్షన్లు ఇస్తున్నప్పుడు అదే పనిగా టికెట్లు కొని జనాన్ని హాలు దాకా రప్పించాలంటే దర్శక నిర్మాతలకు పెద్ద సవాలే. అందుకే బ్రో లాంటివి సైతం ఎదురీదాల్సి వస్తోంది .