మొదటి వీకెండ్ ని బ్రో ఘనంగా ముగించింది. డివైడ్ టాక్, రివ్యూలను తట్టుకుని మెయిన్ సెంటర్స్ థియేటర్లను కళకళలాడించింది. నైజామ్ లాంటి పట్టున్న ప్రాంతాల్లో దాదాపుగా హౌస్ ఫుల్స్ పడ్డాయి. మాస్ కంటెంట్ కి ఎక్కువ ఆదరణ ఉండే సీడెడ్ సెంటర్స్ మాత్రం ఆశించినంత స్పీడ్ గా లేవు. మొత్తం మూడు రోజులకు గాను 50 కోట్ల దాకా షేర్ సాధించిన బ్రో ఇప్పటిదాకా బ్రేక్ ఈవెన్ పరంగా సగానికి పైగా లక్ష్యాన్ని చేరుకుందని ట్రేడ్ రిపోర్ట్. 96 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి లాభాల్లోకి ప్రవేశించడం అంత సులభం కాదు. ఇవాళ సోమవారం డ్రాప్ స్పష్టంగా కనిపిస్తోంది.
మాములుగా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మండే పెద్దగా ప్రభావం ఉండదని ఈ మధ్యే బేబీ నిరూపించింది. అలాంటిది పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఊచకోత కొనసాగుతూనే ఉండాలి. కానీ బుకింగ్ ట్రెండ్స్ లో జోష్ తగ్గింది. రాబోయే శుక్రవారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి బ్రోకి తిరిగి శని ఆదివారాలు ఊతమివ్వబోతున్నాయి. కానీ అప్పటిదాకా వీక్ డేస్ లో ఈ డ్రాప్ శాతాన్ని ఎంత మేరకు కంట్రోల్ చేయగలదనేది చూడాలి. మరోవైపు బేబీ మూడో వారంలో అడుగు పెట్టినా కూడా బ్రో తాకిడిని తట్టుకుంటూ మంచి ఫిగర్స్ నమోదు చేయడం ట్రేడ్ ని విస్మయపరుస్తోంది.
ఈ లెక్కన బ్రో వంద కోట్ల షేర్ దాటితేనే హిట్ గా పరిగణిస్తారు. లేదూ అంటే ఫ్లాప్ కిందకు చేరిపోతుంది. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లు తొంబై దాకా చేరుకున్నాయి కానీ సెంచరీ మార్క్ సాధ్యం కాలేదు. మరి ప్రతికూలతల మధ్య ఈదుతున్న బ్రోకు అది సాధ్యమేనా అంటే చెప్పలేం. ఎలాంటి టికెట్ పెంపు లేకుండా సాధారణ రేట్లకు అమ్ముతున్నప్పుడు సాధారణ రోజుల్లోనూ భారీ ఆక్యుపెన్సీ కనిపించాలి. కానీ బ్రోకి ఆ ట్రెండ్ కనిపించడం అనుమానంగా ఉంది. అయినా సరే మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీకి ఇంత వసూళ్ల అరాచకమంటే అది ముమ్మాటికీ పవన్ బ్రాండ్ తప్ప ఇంకే కారణమూ లేదు.