సంజయ్ దత్ టాలీవుడ్ రీఎంట్రీ?

బాలీవుడ్లో హీరోగానే కాక విలన్, క్యారెక్టర్ రోల్స్‌తోనూ తనదైన ముద్ర వేసిన నటుడు సంజయ్ దత్. ‘ఖల్ నాయక్‌’, ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ లాంటి సినిమాల్లో హీరోగా మెప్పించినా.. ‘అగ్నిపథ్’ లాంటి చిత్రాల్లో విలన్‌గా అదరగొట్టినా సంజుకే చెల్లింది. ఆయన దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ‘కేజీఎఫ్-2’లో అధీర పాత్రలో ఆయనెంత భయపెట్టాడో తెలిసిందే.

ఇక విజయ్ సినిమా ‘లియో’లోనూ కనిపించబోతున్నాడు సంజు. ఐతే తెలుగులో ఆయన పాతికేళ్ల కిందటే నటించిన సంగతి చాలామందికి గుర్తుండకపోవచ్చు. అక్కినేని నాగార్జున సినిమా ‘చంద్రలేఖ’లో చిన్న అతిథి పాత్రలో మెరిశాడు సంజయ్ దత్. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సంజు టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సంజును కృష్ణవంశీ టాలీవుడ్లోకి తీసుకొస్తే.. కృష్ణవంశీ మిత్రుడైన పూరి జగన్నాథ్ ఆయనతో రీఎంట్రీ ఇప్పించబోతున్నాడట. ‘లైగర్’ తర్వాత పూరి రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్ దత్ విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. ఆయన కోసం ఒక బలమైన పాత్రనే డిజైన్ చేశాడట పూరి. సంజయ్ దత్ ఈ ప్రాజెక్టులోకి వస్తే దీని క్రేజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

పూరి కెరీర్‌కు ఎంతో కీలకమైన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇంతకుముందు రామ్‌తో ఆయన చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద హిట్టయింది. దీనికి కొనసాగింపుగా ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ను మొదలుపెట్టారు. వచ్చే వేసవిలో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కాస్టింగ్ అంతా సెట్ చేసుకుని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లబోతోంది పూరి అండ్ టీం. రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో.. సంజు లాంటి విలన్ని ఢీకొంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.