పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం ‘బ్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. తమిళ సినిమాల్లో తమిళ నటులు, టెక్నీషియన్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల రోజా భర్త, సీనియర్ దర్శకుడు సెల్వమణి నేతృత్వంలోని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సి) పెట్టిన కొత్త రూల్స్ గురించి పవన్ ఈ వేడుకలో మాట్లాడాడు.
ఇలా సంకుచిత ధోరణితో ఉంటే సినీ పరిశ్రమ ఎదగదని.. అన్ని భాషల వాళ్లనూ కలుపుకుని వెళ్తేనే ముందడుగు వేయగలమని.. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శమని పవన్ వ్యాఖ్యానించాడు. దీనిపై తమిళుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ కోలీవుడ్‌కు నీతులు చెప్పాల్సిన పని లేదని కొందరంటే.. తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూసే తెలుగు సినీ పరిశ్రమను ముందు దారిన పెట్టుకోవాలంటూ పవన్‌కు కొందరు కౌంటర్లు వేశారు.
ఐతే పవన్‌తో సన్నిహిత సంబంధాలున్న సీనియర్ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్.. పవన్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు. పవన్ పేరు ఎత్తి ఆయన మీదేమీ విమర్శలు చేయలేదు కానీ.. తమిళ పరిశ్రమ ఇతర భాషా నటీనటులను, టెక్నీషియన్లను దూరం పెడుతుందనే వాదనను ఆయన తప్పుబట్టారు.
అన్ని భాషల వాళ్లనూ అక్కున చేర్చుకునే పరిశ్రమ కోలీవుడ్ అని.. దశాబ్దాల కిందటే ఎస్వీఆర్, సావిత్రి లాంటి తెలుగు ఆర్టిస్టులు తమిళ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారని.. తర్వాత కూడా ఎంతోమంది పరభాషా నటీనటులు, టెక్నీషియన్లకు కోలీవుడ్ అవకాశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. కోలీవుడ్ గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. ఎవరూ అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే ఫెఫ్సి పెట్టిన రూల్స్‌తో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. ఇక్కడ అలాంటి షరతులేమీ లేవని నాజర్ చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates