ఇండియన్-2 ఒక్కటే కాదు..

ఒక సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడం అరుదైన విషయం.అది కూడా ఫస్ట్ పార్ట్‌ చేసిన హీరో, దర్శకుడు మళ్లీ కలిసి సీక్వెల్ చేయడం ఇంకా ప్రత్యేకం.  ‘ఇండియన్’ విషయంలో అదే జరగబోతోంది. 1996లో విడుదలై తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ను కొన్నేళ్ల ముందే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యమై 2024లో విడుదల కాబోతోంది. వచ్చే వేసవికి రిలీజ్ అనుకుంటున్నారు.

ఈ సినిమా వల్లే రామ్ చరణ్‌తో శంకర్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ లేట్ అయింది. రెండు సినిమాలనూ సమాంతరంగా తీసేలా మధ్యలో ప్లానింగ్ జరిగినా.. శంకర్ ఎక్కువగా ‘ఇండియన్-2’కే సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. షూట్ పూర్తి చేసి కొన్ని నెలల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు శంకర్. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడో ఆసక్తికర ప్రచారం నడుస్తోంది.

‘ఇండియన్-2’తో ఈ సినిమా కథ ముగియదట. దీనికి కొనసాగింపుగా ఇంకో సినిమా కూడా వస్తుందట. ఇండియన్-2 కోసం షూట్ చేసిన మొత్తం ఫుటేజ్ 6 గంటల నిడివితో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని అని.. అందుకే దీన్ని రెండు భాగాలుగా చేద్దామని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

మధ్యలో కథను ఒక కొలిక్కి తెచ్చి.. ఇండియన్-3కి హింట్ ఇస్తూ ఈ సినిమాను ముగిస్తారట. అప్పటికి మిగిలిన ఫుటేజ్‌తో 75 శాతం సినిమా రెడీగా ఉంటుందని.. మరికొన్ని సన్నివేశాలు యాడ్ చేసి వీలు చిక్కినపుడు షూట్ చేసి.. వచ్చే ఏడాది చివర్లోనే ‘ఇండియన్-3’ని రిలీజ్ చేద్దామని టీం ఆలోచిస్తోందట. ‘ఇండియన్-2’ బడ్జెట్ హద్దులు దాటిపోయిన నేపథ్యంలో బిజినెస్ పరంగా కూడా ఇది మంచి ఐడియా అవుతుందని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రావచ్చని కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతోంది.