టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పవర్ పవన్ కళ్యాణ్ సినిమా సందడి చూడబోతున్నాం. రీఎంట్రీ తర్వాత పవన్ మూడో సినిమా ’బ్రో‘ వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ గత రెండు చిత్రాలకూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు నుంచి ఇబ్బందులు తప్పలేదు. ’వకీల్ సాబ్‘ను దెబ్బకొట్టే ఉద్దేశంతో మొత్తంగా ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించేయడం.. ఆ తర్వాత ఏడాది పాటు ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పడటం తెలిసిందే.
’వకీల్ సాబ్‘కు ఏపీలో ఎక్కడా స్పెషల్ షోలు లేవు. రేట్లు బాగా తగ్గించేయడం వల్ల కూడా వసూళ్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇక ’భీమ్లానాయక్‘ సినిమా టైంకి రేట్ల పెంపు, అదనపు షోలకు జీవో రెడీ అయినా.. కావాలనే ఆ సినిమా రిలీజయ్యే వరకు దాన్ని ఆపారనే విషయం బహిరంగ రహస్యమే. ఐతే తర్వాత వచ్చిన పెద్ద సినిమాలన్నింటికీ రేట్లు పెంచుకునే, అదనపు షోలు వేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నారు. కానీ అది జరగాలంటే నిర్మాతలు వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలిసి రావాల్సిందే.
గత నెలలో వచ్చిన ’ఆదిపురుష్‘కు కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమాకు కోరుకున్నట్లే రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతులు లభించాయి. ఈ నేపథ్యంలో ’బ్రో‘ విషయంలో ఏం జరుగుతుందా అని అంతా ఎదురు చూశారు. న్యాయంగా, నిబంధనల ప్రకారం అయితే నిర్మాతలు దరఖాస్తు చేసుకుంటే రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతులు ఇచ్చేయాలి. కానీ పవన్ సినిమా కాబట్టి ఏపీ ప్రభుత్వం అంత తేలిగ్గా పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అందుకోసం నిర్మాతలు వచ్చి తమను అడుక్కోవాలని ప్రభుత్వ పెద్దలు పంతం పట్టుకుని ఉండొచ్చు.
అదే జరిగితే.. పవన్ తన సినిమాకు సాయం అవసరమైతే తన నిర్మాతలను జగన్ దగ్గరికే పంపాడు చూశారా అంటూ వైసీపీ వాళ్లు ఎద్దేవా చేస్తారడనంలో సందేహంలేదు. ఓవైపు రాజకీయంగా జగన్, వైసీపీని బలంగా ఢీకొడుతూ.. తన సినిమా రేట్లు, షోల కోసం నిర్మాతలను ప్రభుత్వ పెద్దల దగ్గరికి పంపితే పవన్ ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశమూ ఉంది. అందుకే అలా చేయొద్దని పవన్ తన నిర్మాతలకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ’బ్రో‘ పరిమిత బడ్జెట్లో తెరకెక్కడం, రిలీజ్ కు ముందే నిర్మాతలకు లాభాలు కూడా వచ్చేయడంతో ప్రొడ్యూసర్లు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది.