తెలుగు సినిమా చరిత్రలోనే కొత్త దర్శకులు తీసిన చిత్రాల్లో అతి పెద్ద సెన్సేషన్స్‌లో ఒకటిగా నిలిచే సినిమా గులాబి. టాలీవుడ్ గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ.. ఈ చిత్రంతో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ ప్రేమకథ అప్పట్లో యువతను ఒక ఊపు ఊపేసి బ్లాక్‌బస్టర్ అయింది. ఐతే ఇందులో హీరో పాత్రలో జేడీని కాకుండా ఇంకొకరిని ఊహించుకోవడం కష్టమే.
ఆ పాత్రకు అంత పర్ఫెక్ట్ అనిపించాడతను. ఐతే నిజానికి ముందు ఈ సినిమాకు హీరో జేడీ కాదట. వేరే హీరోతో సినిమాను మొదలుపెట్టి ఆపేశాడట కృష్ణవంశీ. అతనలా స్ట్రగులవుతున్న సమయంలో తనే అప్పటి స్టార్ హీరోల్లో ఒకడైన రాజశేఖర్ పేరు చెప్పి ఆయనకు కథ చెప్పించేందుకు కృష్ణవంశీని తీసుకెళ్లినట్లు జేడీ తాజాగా వెల్లడించాడు.
రాజశేఖర్ దగ్గరికి వెళ్లాక కృష్ణవంశీ వేరే కథ చెప్పాడని.. ఐతే తానే మధ్యలో ఆపి గులాబి కథ చెప్పమని బలవంతం చేశానని జేడీ తెలిపాడు. గులాబి కథ చెప్పగా.. హీరో పాత్ర నచ్చి రాజశేఖర్ తాను లీడ్ రోల్ చేస్తానని అన్నాడని.. అలాగే బ్రహ్మాజీ చేసిన పాత్రలో తనను నటించమని కూడా చెప్పాడని జేడీ వెల్లడించాడు.
కానీ కథ చెప్పి బయటికి వచ్చాక ఈ కథను తాను హీరోగా అయితేనే చేస్తానని కృష్ణవంశీ పట్టుబట్టాడని.. అలా తాను ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశానని జేడీ తెలిపాడు. తాను ముఖ్య పాత్ర పోషించిన వెబ్ సిరీస్ దయా రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో జేడీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనను హీరోగా పరిచయం చేసి మంచి స్థాయికి వెళ్లడానికి కారణమైంది కృష్ణవంశీ అని, అందుకే తన డెబ్యూ వెబ్ సిరీస్ ఈవెంట్‌కు కృష్ణవంశీని పట్టుబట్టి పిలిపించానని జేడీ తెలిపాడు.