ఓ మై గాడ్…ఇది పాత తెలుగు సినిమానే

తెలివిగా ఆలోచించాలే కానీ కొత్త కథల కోసం బుర్రలు బద్దలు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఇతర బాషల పాత సినిమాలు చూస్తే చాలు బోలెడు ఐడియాలు వచ్చేస్తాయి. ఆగస్ట్ 11న అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ 2 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవాళ టీజర్ ని రిలీజ్ చేశారు. సన్నీడియోల్ గదర్ ఏక్ ప్రేమ్ కథ 2తో గట్టి పోటీ ఉన్నప్పటికీ సందీప్ రెడ్డి వంగా యానిమల్ తప్పుకోవడంతో దీనికి కలిసి వస్తోంది. ఓమైగా మొదటి భాగం 2012లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. దీన్నే తెలుగులో పవన్ కళ్యాణ్ వెంకటేష్ లతో గోపాల గోపాలగా రీమేక్ చేయడం తెలిసిందే.

పదకొండేళ్ల తర్వాత ఓ మై గాడ్ 2 ని తీసుకొస్తున్నారు. కథేంటో క్లుప్తంగా చెప్పేశారు. శివారాధనలో నిత్యం మునిగే పరమ ఆస్థికుడు(పంకజ్ త్రిపాఠి)కి, దివి నుంచి భువికి దిగి వచ్చిన పరమశివుడు(అక్షయ్ కుమార్)కు మధ్య జరిగే డ్రామాగా దర్శకుడు అమిత్ రాయ్ దీన్ని రూపొందించారు. అయితే ఈ కథ మనదే. 1979లో మా ఊళ్ళో మహాశివుడు వచ్చింది. అల్లు రామలింగయ్య సమర్పణలో అల్లు అరవింద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. గుడి పూజారి సత్యనారాయణ తనకొచ్చిన కష్టాలకు దేవుడిని నిందిస్తే రావుగోపాలరావు రూపంలో గరళకంఠుడు భూమికి వచ్చి అతనికి జ్ఞానాన్ని విముక్తిని ప్రసాదిస్తాడు.

రాజా చంద్ర దర్శకత్వం వహించిన మా ఊళ్ళో మహాశివుడులో మంచి కామెడీతో పాటు బోలెడు పంచులు, ఎమోషన్లు ఉంటాయి. పెద్ద హిట్టు కాకపోయినా జనాన్ని మెప్పించింది .ఇప్పుడీ ఓ మై గాడ్ 2 కూడా అదే ఛాయల్లో కనిపిస్తోంది. కాకపోతే మోడరన్ శివుడు కాబట్టి స్టైలిష్ గా గ్రాఫిక్స్ సహాయంతో కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. మొత్తం స్టోరీ అచ్చం అలాగే ఉంటుందని చెప్పలేం కానీ మెయిన్ లైన్ అయితే దగ్గరగా కలుస్తోంది. డివోషనల్ టచ్ ఉన్న చిత్రం కావడంతో ఇది సక్సెస్ కావడం పట్ల యూనిట్ చాలా ధీమాగా ఉంది. అయిదుగురు సంగీత దర్శకులు దీనికి పని చేయడం విశేషం