సవాళ్ల మధ్య డబుల్ ఇస్మార్ట్ పరుగులు

గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ మొదలైపోయింది. ప్రత్యేక అతిథులు ఎవరూ లేకుండా పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ ఇద్దరే పూజా లాంఛనాన్ని, క్లాప్ ని, ఫస్ట్ షాట్ ని పూర్తి చేశారు. హీరో రామ్ తప్ప క్యాస్టింగ్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. విడుదల తేదీని 2024 మార్చి 8 అని ముందే ప్రకటించేయడంతో ఎనిమిది నెలల కాలంలో వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ గానే ప్లాన్ చేశారు. తనకు అతి పెద్ద మాస్ ఇమేజ్ ఇచ్చిన దర్శకుడిగా పూరి మీద రామ్ కు చాలా నమ్మకం ఉంది. అందుకే ఆలోచించకుండా సీక్వెల్ కి ఎస్ చెప్పేశాడు.

రాబోయే రోజుల్లో సవాళ్ళ మధ్యే డబుల్ ఇస్మార్ట్ పరుగులు పెట్టాలి. లైగర్ డిజాస్టర్ పూరి బ్రాండ్ ని బాగా దెబ్బ తీసింది. ఎంతగా అంటే విజయ్ దేవరకొండ జనగణమన ప్రకటించి నిర్మాత ప్రీ ప్రొడక్షన్ కి కోట్లు ఖర్చు పెట్టాక ఆపేసేంత. పైగా లైగర్ పెట్టుబడుల విషయంలో ఈడి దృష్టిలో పడటం చాలా ఇబ్బంది పెట్టింది. తనలో క్రియేటివ్ టాలెంట్ అయిపోయిందనే కామెంట్లకు పూరి స్వయంగా ఊతమిచ్చాడు. ఇప్పుడు వాటికి సమాధానం చెప్పాలంటే డబుల్ ఇస్మార్ట్ ని పేరుకు తగ్గట్టే మాస్ కి పిచ్చెక్కించే కంటెంట్ తో తెరకెక్కించాలి. ఒకప్పటి పోకిరి టేకింగ్ ని చూపించాలి.

హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు ఉంటారా లేక కొత్త జోడిలను తీసుకొస్తారా చెప్పలేదు. సంగీత దర్శకుడెవరో ఫైనల్ చేయలేదు. లైగర్ కు చివరి నిమిషం దాకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పకుండా నానబెట్టి చివరికి బాలీవుడ్ బ్యాచ్ తో పని కానిచ్చారు. తీరా చూస్తే బ్యాడ్ ఆల్బమ్ పడింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మణిశర్మనే కొనగిస్తారో లేక ఎవరైనా కొత్తవాళ్లను తీసుకుంటారో చూడాలి. ఇక రామ్ కు వారియర్ ఇచ్చిన షాక్ తర్వాత స్కంద బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకం బలంగా ఉంది. ఇక్కడ చెప్పిన సవాళ్లు ఒత్తిళ్లు డబుల్ ఇస్మార్ట్ టీమ్ తట్టుకోగలిగితే హిట్టు పడ్డట్టే.