సీనియర్ నటుడు నరేష్ గత కొన్నేళ్ల నుంచి బయట ఎలా వార్తల్లో నిలుస్తున్నాడో తెలిసిందే. గత రెండు పర్యాయాలూ ‘మా’ ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత ఆయన తీరు వివాదాస్పదమైంది. తన ప్రవర్తనతో ఇండస్ట్రీలోనే కాక బయటి జనాల్లో కూడా ఆయన వ్యతిరేకత పెంచుకున్నాడు. ఇక తన మూడో భార్య రమ్య రఘుపతితో గొడవలు.. అలాగే పవిత్ర నరేష్‌తో సహజీవనం విషయంలో నరేష్ తీరు ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే.
కొన్నేళ్ల నుంచి ఈ వివాదం వల్ల ఆయన పేరు మీడియాలో నానుతూనే ఉంది. ఈ విషయం మీద ఆయన ‘మళ్ళీ పెళ్ళి’ అంటూ సినిమా కూడా తీశారు. ఈ సినిమాను తనకు అనుకూలంగా, ఏకపక్షంగా తీయించడం మీదా విమర్శలు ఎదుర్కొన్నారు నరేష్. మొత్తంగా చూస్తే వ్యక్తిగతంగా ఆయన తీరు చాలామందికి రుచించట్లేదన్నది వాస్తవం.
ఐతే బయట నరేష్ ఎలా ఉన్నా సరే.. తెర మీద మాత్రం ఆయన్ని ఎవ్వరైనా ఇష్టపడాల్సిందే. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. వారెవా అనిపిస్తారు నరేష్. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ అని లేకుండా కొలిచినట్లు.. పాత్రకు తగ్గట్లు నటించడం నరేష్ ప్రత్యేకత. వ్యక్తిగతంగా ఆయన ఏంటి అనే విషయం మరిచిపోయి ఆయన చేసిన పాత్రతో కనెక్ట్ అవుతాం. ఆయన నటనకు అబ్బురపడతాం. అంత బాగా తన పాత్రలను పండిస్తారు నరేష్. ఈ మధ్య నరేష్ చేసిన మూడు సినిమాలు ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
‘అన్నీ మంచి శకునములే’లో హీరోయిన్ తండ్రిగా చాలా బాగా నటించి మెప్పించారు నరేష్. అలాగే ‘ఇంటింటి రామాయణం’ అనే సినిమాలోనూ ఆయన పాత్ర కట్టి పడేసింది. ఈ సినిమాకు మేజర్ హైలైట్ ఆయన పాత్రే అనడంలో సందేహం లేదు. తాజాగా ‘సామజవరగమన’తో మరోసారి తన మార్కు చూపించాడు నరేష్. ఆస్తి కోసం డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని నడి వయస్సులోనూ పోరాడే.. ఎవ్వరూ ఊహించలేని పాత్రలో ఆయన కడుపుబ్బ నవ్వించాడు. ఈ సినిమాకు కూడా నరేష్ పాత్ర పెద్ద ఎసెట్‌గా నిలిచింది. ఇలా సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. అద్భుత అభినయంతో తన పాత్రలు పండిస్తూ తెర మీద నరేష్‌ను కొట్టేవాడు లేడని రుజువు చేస్తున్నారాయన.
Gulte Telugu Telugu Political and Movie News Updates