‘ఏజెంట్’ విషయంలో నిర్మాత కరెక్షన్

2023లో వచ్చిన తెలుగు చిత్రాల్లో అతి పెద్ద డిజాస్టర్ ‘ఏజెంట్’యే. నిర్మాత అనిల్ సుంకర చెప్పిన లెక్క ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లు. కానీ అందులో పదో వంతు షేర్ కూడా రాలేదు ఈ చిత్రానికి. ఎంత నాన్ థియేట్రికల్ ఆదాయం కలుపుకున్నా కూడా బడ్జెట్లో సగం కూడా వెనక్కి రానట్లే. వారం రోజుల్లోపే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిపోగా.. అంతలోనే ప్రేక్షకులకు సారీ చెబుతూ నిర్మాత అనిల్ సుంకర ఒక నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయింది.

ఇందులో అఖిల్ కష్టాన్ని కొనియాడిన ఆయన.. దర్శకుడు సురేందర్ రెడ్డి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. బౌండ్ స్క్రిప్టు లేకుండా సినిమా తీయడం తాము చేసిన తప్పని అన్నాడు. మరోవైపు అఖిల్ అభిమానులకు సారీ చెబుతూ రిలీజ్ చేసిన నోట్‌లో దర్శకుడి పేరు ప్రస్తావించకపోవడంతో హీరో, నిర్మాత ఇద్దరూ ‘ఏజెంట్’ ఫలితానికి సూరినే నిందిస్తున్నట్లు అనిపించింది.

ఐతే పెద్ద నష్టం జరిగినపుడు ఇలా ఆగ్రహాన్ని వెలిబుచ్చాక.. కొన్నాళ్లకు మనసు మారడం మామూలే. నిర్మాత అనిల్ ఆలోచన కూడా అలాగే మారినట్లుంది. తన నిర్మాణంలో వచ్చిన కొత్త చిత్రం ‘సామజవరగమన’ సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సురేందర్ విషయంలో కొంచెం సానుకూల వ్యాఖ్యలు చేశారు. ‘‘బౌండ్ స్క్రిప్టుతో సెట్‌కు వెళ్లామంటే నిర్మాణ వ్యయం దఅదుపులో ఉంటుంది. ఫలితం అటు ఇటు అయినా పది శాతం ప్రభావమే ఉంటుంది.

‘ఏజెంట్’కు సంబంధించి ఈ విషయంలోనే తప్పు జరిగింది. రకరకాల కారణాలతో బౌండ్ స్క్రిప్టుతో సెట్‌కు వెళ్లలేకపోయాం. నేనైనా, దర్శకుడైనా అఖిల్‌ను ఈ సినిమాతో పెద్ద రేంజికి తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతోనే రంగంలోకి దిగాం. ఫలితం మరోలా వచ్చింది. ఇందులో మా అందరి తప్పూ ఉంది.  మా సినిమాకు తప్పు ఎక్కడ జరిగిందో తెలిసింది కాబట్టి.. ఇంకెవరూ అలా చేయొద్దనే అలా ట్వీట్ చేశా’’ అని అనిల్ వివరణ ఇచ్చాడు.