గత ఏడాది ప్రిన్స్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. తెలుగు దర్శకుడు, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళఃలో మంచి మంచి సినిమాలు చేసిన శివకు తెలుగు అరంగేట్రంలో సరైన సినిమా పడలేదు. అయినా అతను నిరాశ చెందకుండా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అదే.. మహావీరుడు. తమిళంలో మావీరన్ పేరుతో తెరకెక్కిన చిత్రమిది. మండేలా అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రశంసలు అందుకున్న మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 14నే తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ లాంచ్ చేశారు. అది ఆద్యంతం వినోదాత్మకంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అత్యంత పిరికివాడైన ఓ కుర్రాడు.. చాలా ధైర్యవంతుడిలా ప్రొజెక్టవ్వడం.. అతడికి ఒక రాజకీయ పార్టీ అధినేతతో గొడవ మొదలవడం.. అనూహ్య పరిణామాల మధ్య అతను తనకు తెలియకుండానే ధైర్యవంతుడిగా మారి ఆ రాజకీయ నేతకు సవాలు విసరడం.. ఈ నేపథ్యంలో సాగే సినిమా ఇది. హీరో పాత్రకు సంబంధించి పెద్ద ట్విస్టేదో ఉన్నట్లుగా ట్రైలర్లో చూపించారు కానీ.. ఆ ట్విస్టు పూర్తిగా ఓపెన్ చేయలేదు.
విలన్ పాత్రలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ నటించాడు. అతడి పాత్ర బాగానే హైలైట్ అయ్యేలా ఉంది. శివ కార్తికేయన్ తనదైన శైలిలో పెర్ఫామ్ చేసినట్లున్నాడు. తెలుగు కమెడియన్ టర్న్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ ఇందులో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. నిన్నటితరం నటి సరిత హీరో తల్లిగా అదరగొట్టింది. హీరోయిన్‌గా శంకర్ తనయురాలు అదితి నటించిందీ చిత్రంలో. ట్రైలర్ చూస్తే సినిమాలో హిట్టు కళ కనిపిస్తోంది.