హమ్మయ్య నరేష్ వెనక్కు వచ్చాడు

అల్లరోడుగా పేరు తెచ్చుకుని కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన అల్లరి నరేష్ మహర్షి నుంచి పూర్తి సీరియస్ టర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కు రాలేదు. నాంది మంచి హిట్ కావడంతో తన నుంచి అందరూ ఇలాంటివే ఆశిస్తున్నారనుకుని వరసగా అవే చేశాడు. కాన్సెప్ట్ బాగున్నా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం జనానికి చేరలేదు. డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని ట్రై చేసిన ఉగ్రం పెర్ఫార్మన్స్ పరంగా పేరు తెచ్చింది తప్ప కమర్షియల్ లెక్కల్లో డబ్బులు రాలేదు. సో కేవలం ఒక జానర్ కే కట్టుబడటం కరెక్ట్ కాదని గుర్తించిన తన టైమింగ్ కి మరోసారి పదును పెట్టే కాంబో ఎంచుకున్నాడు.

సోలో బ్రతుకే సో బెటరూ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందబోయే తన 62వ సినిమా అనౌన్స్ మెంట్ తో వెరైటీగా కనిపించాడు. ఇందులో తలతిక్క, పొగరు, సరదాగా ఉండే క్యారెక్టర్ తో ఎప్పుడూ బార్ లో ఉండే అవతారంతో దర్శనమివ్వబోతున్నాడు.  మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, రిచర్డ్ ఎం నాథన్ ఛాయాగ్రహణం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మకడలి ఆర్ట్, విప్పర్తి మధు స్క్రీన్ ప్లేతో మొత్తం పర్ఫెక్ట్ సెటప్ ని ఎంచుకున్నాడు. రెండు నిమిషాలకు పైగానే ఉన్న ప్రకటన వెరైటీగా ఉండి ఆకట్టుకుంటోంది

సోలో బ్రతుకేలో ఎంటర్ టైన్మెంట్ తో ఆకట్టుకున్న దర్శకుడు సుబ్బుతో నరేష్ జోడి నుంచి మంచి వినోదాన్ని ఆశించవచ్చు. ఒకప్పుడు రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి వాళ్ళు ఏలిన కామెడీ జానర్ ని తిరిగి తన పట్టులోకి తెచ్చుకోవాలని అల్లరి నరేష్ గత కొంత కాలంగా ట్రై చేస్తున్నాడు కానీ దానికి తగ్గ కథలు డైరెక్టర్లు దొరకడం లేదు. జంబలకిడిపంబ, అలీబాబా అరడజను దొంగలు లాంటి తండ్రి క్లాసిక్స్ కి కొనసాగింపు కోసం ఎదురు చూస్తున్న నరేష్ కి మళ్ళీ హిట్లు పడ్డాయంటే ఎంటర్ టైనర్లు ఆశించవచ్చు. ప్రస్తుతనికి ఈ 62కి టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు.