ఏదైనా కొత్త వస్తువుకు మార్కెట్ లో డిమాండ్ తగ్గినప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం డిస్కౌంట్లు ఇవ్వడం సహజం. ఇది సినిమాలకూ వరిస్తుంది. కాకపోతే ఏ రెండు మూడు వారాల తర్వాత చేస్తే బాగుంటుంది కానీ తొందరపడితే మాత్రం థియేటర్ లో చూడనివాళ్లకు కూడా కంటెంట్ మీద డౌట్ వచ్చేస్తుంది. ఆదిపురుష్ కు మొదటి వారంలోనే ఆఫర్ ప్రకటించి 150 రూపాయలు చేశారు. పెద్దగా స్పందన రాలేదు. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ ఎంత తీవ్రంగా ఉంటుందో ముందే పసిగట్టి దాన్ని 112 రూపాయలకు తగ్గించేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కీం లేదు లెండి
నార్త్ ఆడియన్స్ లో ఆదిపురుష్ పట్ల విపరీతమైన నెగటివిటీ ఉండటంతో నిర్మాతల పాట్లు అన్నీ ఇన్ని కావు. అయినా సినిమా తీసింది హిందీలో. అన్ని భాషలకు టైటిల్ యధాతథంగా పెట్టారు. ప్రభాస్ కృతి మినహాయించి మిగిలిన ఆర్టిస్టులందరూ ఏ భాష మాట్లాడారో ఈజీగా గుర్తు పట్టొచ్చు. విచిత్రంగా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసిన ఏపీ తెలంగాణలో ఎలాంటి మినహాయింపులు లేవు కానీ ఒరిజినల్ కు మాత్రం ఇన్నేసి కన్సెషన్లు ఎలా ఇస్తారని మూవీ లవర్స్ వాపోతున్నారు. వీకెండ్ పుణ్యమాని మన దగ్గర నిన్నా మొన్న పర్వాలేదనిపించేలా బుకింగ్స్ జరిగాయి.
ఇక్కడితో ఈ తగ్గింపు పర్వానికి ముగింపు పలకాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇంత కన్నా ఆఫర్ ఇస్తే ట్రోలింగ్ కు అవకాశం ఇవ్వడం తప్ప ఇంకెలాంటి ప్రయోజనం లేదనేది వాళ్ళ వాదన. అందులో లాజిక్ లేకపోలేదు. నిన్నటి దాకా హైక్ రేట్లతోనే టికెట్లు అమ్మిన ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి మాములు ధరలు అందుబాటులోకి వచ్చాయి. అయినా దీని వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. జరగాల్సిన నష్టం అయిపోయింది కాబట్టి ఇదేదో ముందే చేసి ఉంటే ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసేవారు. హైదరాబాద్ పర్వాలేదు కానీ మిగిలిన చోట్ల మాత్రం ఆదిపురుష్ ఫేర్ వెల్ కు రెడీ అయిపోయింది