ఈ వేసవిలో విడుదలైన అక్కినేని అఖిల్ సినిమా ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. నిర్మాత చెప్పిన ప్రకారం దీని బడ్జెట్ రూ.80 కోట్లు అయితే.. థియేటర్ల నుంచి అందులో పదో వంతు కూడా షేర్ రూపంలో రాలేదంటే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. అఖిల్ మార్కెట్ చూసుకోకుండా సినిమా మీద అయిన కాడికి బడ్జెట్ పెట్టేసిన నిర్మాత అనిల్ సుంకర నిండా మునిగిపోయాడు.
ముందు అనుకున్న 50 కోట్ల బడ్జెట్టే ఎక్కువ అనుకుంటే.. దాని మీద 30 కోట్లు ఎక్కువ పెట్టడం అన్నది విడ్డూరంగా అనిపించే విషయమే. సినిమాను డెఫిషిట్లో రిలీజ్ చేసినప్పటికీ.. బయ్యర్లకు నష్ట పరిహారం చెల్లించాల్సిన స్థితికి చేరుకున్నాడు. ఈ సినిమాను ఓ మోస్తరు రేట్లకు కొన్నప్పటికీ బయ్యర్లు భారీగా నష్టపోయారు.
ఐతే ఈ సినిమాను కొనబోయి వెనక్కి తగ్గిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. దేవుడే తమను కాపాడాడంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. ‘ఏజెంట్’ థియేట్రికల్ హక్కులను తనతో సహా ఆరుగురు కలిపి తీసుకోవాలని అనుకున్నట్లు సునీల్ వెల్లడించాడు. హక్కుల కోసం నిర్మాత అనిల్ సుంకరను సంప్రదిస్తే భారీ రేటు చెప్పారని.. అది తమకు గిట్టుబాటు కాదని భావించి వేరే వాళ్లకు సినిమాను ఇచ్చుకోమని చెప్పి తాము వెనక్కి తగ్గినట్లు సునీల్ తెలిపాడు.
ఈ సినిమా రైట్స్ తీసుకోకుండా దేవుడే తమను కాపాడాడంటూ ఆయన సెటైర్ వేశాడు. అనిల్ సుంకర ఇన్నేళ్లలో సినిమాల ద్వారా సంపాదించిందంతా ఒక్క ‘ఏజెంట్’ సినిమాతో పోగొట్టుకున్నట్లు సన్నిహితుల సమాచారం. ఇప్పుడు ఆయన ఆశలన్నీ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘భోళా శంకర్’ మీదే ఉన్నాయి. ఆగస్టు 11న రిలీజయ్యే ఈ చిత్రం ‘ఏజెంట్’ నష్టాలను కొంతమేర అయినా భర్తీ చేస్తుందని ఆయన ఆశిస్తున్నారు.