ఇక ప్రభాస్‌ను ముంచినా తేల్చినా అతనే..

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అసాధారణమైనవి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక్క సినిమాతో ఇంత ఎదిగిన హీరో మరొకరు లేడు అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఐతే ప్రభాస్ ఈ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేదు. సరైన సినిమాలు ఎంచుకోకపోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాడు. ‘సాహో’ విపరీతమైన హైప్ తెచ్చుకుని, అంచనాలను అందుకోలేక చతికిల పడింది.

ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ అయితే మరింత నిరాశకు గురి చేసింది. ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఎన్నో ఆశలు రేకెత్తించి.. చివరికి నిరాశకు గురి చేసింది. వీకెండ్ వరకు సత్తా చాటిన ఈ చిత్రం.. ఆ తర్వాత చల్లబడిపోయింది. ప్రభాస్ ఖాతాలో వరుసగా మూడో డిజాస్టర్ జమ కాబోతోందని తేలిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పట్లాగే తర్వాతి సినిమా మీదికి తమ ఆశలను మళ్లించారు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ లైన్లో పెట్టిన చిత్రాల్లో అత్యంత ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నది ‘సలార్’యే. ‘కేజీఎఫ్’తో సంచలనం రేపిన ప్రభాస్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ప్రభాస్‌ను ముంచినా తేల్చినా ప్రశాంత్ నీలే అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఐతే ఇది మిస్ ఫైర్ అయ్యే అవకాశాలే లేవని అభిమానులు ధీమాగా ఉన్నారు. ‘కేజీఎఫ్’ను మాస్, ఎలివేషన్ సీన్లతోనే వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు ప్రశాంత్.

పెద్దగా మాస్ ఇమేజ్ లేని యశ్‌నే అంత పెద్ద మాస్ హీరోగా ఎలివేట్ చేసి చూపించిన ప్రశాంత్.. ప్రభాస్ లాంటి కటౌట్‌ను ఇంకెలా చూపిస్తాడో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. కథాకథనాల పరంగా ఇందులో అద్భుతాలేమీ ఆశించట్లేదు ఫ్యాన్స్. ప్రభాస్ కటౌట్, ఇమేజ్‌కు తగ్గ మాస్, ఎలివేషన్ సీన్లు ఉంటే చాలని.. సినిమా ఈజీగా బాక్సాఫీస్‌ను దున్నేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇంకో వంద రోజుల్లోనే సినిమా రాబోతుండటంతో ‘ఆదిపురుష్’ సంగతి వదిలేసి.. ‘సలార్’ వైపు ఆశగా చూస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.