సినిమా బాలేదన్నాడు.. చితకబాదారు

మొన్నేమో ఒక నటుడు సినిమా రివ్యూలు రాసే రైటర్ల మీద విరుచుకుపడ్డాడు. మీరు సినిమా తీసి తర్వాత రివ్యూలు రాయండి అన్నాడు లాజిక్ లేకుండా. ఇక ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా బాలేదు అంటూ సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్టు పెడితే చాలు.. సదరు హీరో ఫ్యాన్స్ బూతులు అందుకుంటారు. అదే పనిగా సినిమాను టార్గెట్ చేయడం, బావున్న సినిమాను బాలేదని అనడం తప్పే కానీ.. బాలేని సినిమా మీద తమ అభిప్రాయాన్ని వెల్లడించడం కూడా తప్పయిపోతోంది.

కొత్త సినిమా రిలీజైనపుడల్లా హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో ముందుగా షోలు పడుతుంటాయి. షోలు అవ్వగానే బయట మైకులు పట్టుకుని మీడియా వాళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లు సిద్ధంగా ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఆ మైకుల ముందు అవాకులు చెవాకులు పేలే వాళ్లు, అనవసర హంగామా చేసేవాళ్లు ఎలాగూ ఉంటారు.

వాళ్లకు తోడు జెన్యూన్‌గా తమ అభిప్రాయం చెప్పే సగటు ప్రేక్షకులు కూడా ఉంటారు. ఈ శుక్రవారం ఉదయం ‘ఆదిపురుష్’ షో అనంతరం ఒక కుర్రాడు సినిమా బాలేదంటూ తన అభిప్రాయం చెబుతుంటే.. పక్కనే ఉన్న ప్రభాస్ అభిమానులకు కోపం వచ్చింది. నువ్వసలు సినిమా చూశావా.. ఎలా చూశావసలు.. సినిమా బాలేదని ఎలా అంటావు అంటూ తనతో గొడవకు దిగారు.

ఆ కుర్రాడు వాళ్లకు దీటుగానే బదులిచ్చాడు. టికెట్ కొని సినిమా చూశా.. నా అభిప్రాయం నేను చెబుతానంటూ వారితో వాదించాడు. ఈ మాటలు రుచించని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ కుర్రాడి మీద దాడికి దిగారు. మీడియా కెమెరాల ముందే అతడిపై దాడి జరిగింది. ఈ వీడియో నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. సినిమా బాలేదంటే కొట్టడం ఏంటి.. ఎవరి అభిప్రాయం వాళ్లది కదా.. ఇదేం సంప్రదాయం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు.