క‌త్రినా పుణ్యం.. వంద మంది డ్యాన్స‌ర్లు బ‌తుకుతున్నారు

కరోనా ఎన్నో కోట్ల మంది జీవితాల్ని అత‌లాకుత‌లం చేసింది. వాళ్లు ఉపాధిని పోగొట్టింది. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ఏ లోటూ లేకుండా బ‌తికిన వాళ్లు కూడా ఇప్పుడు నెల‌ల త‌ర‌బ‌డి ఆదాయం లేక త‌మ స్థాయికి త‌గ‌ని ప‌నుల వైపు మ‌ళ్లుతున్నారు. క‌రోనా వ‌ల్ల కుదేలైన రంగాల్లో సినిమా ఫీల్డ్ కూడా ఒక‌టి.

అందులోని కార్మికుల‌కు ఆరు నెల‌లుగా ఉపాధి లేదు. సినీ ప‌రిశ్ర‌మ నుంచి అందే సాయంతో క‌డుపు నిండినా మిగ‌తా అవ‌స‌రాల మాటేంటి? ఇలా ఎన్ని నెల‌లు ఆ సాయం మీదే ఆధార‌ప‌డి బ‌త‌క‌డం. పైగా అంద‌రికీ కూడా సాయం అంద‌క‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఆదాయం కోసం వేరే మార్గాల వైపు చూస్తున్నారు.

కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేయాల‌న్నా ఎంతో కొంత పెట్టుబ‌డి కావాలి. అది అందించే వాళ్లు దేవుళ్లే ఇప్పుడు. బాలీవుడ్లో వంద మంది డ్యాన్స‌ర్ల‌కు ఇప్పుడు క‌త్రినా కైఫ్ దేవ‌త‌లాగే క‌నిపిస్తోంది. క‌రోనా వ‌ల్ల విప‌త్క‌ర పరిస్థితుల్లో ఉన్న వంద మంది డ్యాన్స‌ర్ల‌కు క‌త్రినా ఆర్థిక సాయం చేసింది. వాళ్లు కూర‌గాయ‌ల దుకాణాలు పెట్టుకోవ‌డానికి డ‌బ్బులిచ్చింది.

ఇంత‌కుముందు హృతిక్ రోష‌న్ సైతం ఇలా వంద మంది డ్యాన్స‌ర్ల‌కు సాయం చేశాడు. అత‌డి స్ఫూర్తితోనే క‌త్రినా కూడా త‌న వంతు సాయం ప్ర‌క‌టించింది. ఈ డ‌బ్బులు అందుకున్న డ్యాన్స‌ర్లు కూర‌గాయ‌ల‌కు ఇప్పుడున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని చిన్న స్థాయిలో వ్యాపారం పెట్టుకున్నారు. దీంతో వారి కుటుంబాల‌కు తాత్కాలికంగా క‌ష్టాలు తీరిపోయాయి. సినిమాల్లో మ‌ళ్లీ ప‌నులు దొరికే వ‌ర‌కు ఇబ్బంది లేన‌ట్లే.